1999 జూలై 30 న విడుదలైన రాజకుమారుడు సినిమా హీరోగా మహేష్ బాబుకి మొదటి సినిమా. అప్పటిదాకా కృష్ణ గారితో సెకండ్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు మహేష్. వైజయంతీ బ్యానర్ లో అశ్వనీదత్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మొదటి సినిమా కావడంతో స్వయంగా రాఘవేంద్రరావ్ గారు రంగంలోకి దిగి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
‘గోదారి గట్టు మీద చిన్నారి చిలక ఉంది..’ పాట కోసం జరగాల్సిన షూటింగ్ తో మొదలెట్టారు. రామానాయుడు.. తన జూబ్లీహిల్స్ స్టూడియోలో వేసిన సెట్ లో క్లాప్ కొట్టి మహేష్ బాబు కెరీర్ ని స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. ఎక్కడో తెలియని డౌట్ తోనే మొదలెట్టిన సినిమా జూలై 30న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పటికే సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ గారి కొడుకు అనే విషయం బాగా ప్రభావం చూపించడం, మహేష్ స్వయంగా ఎంతో అందంగా ఉండడం, బాగానే యాక్ట్ చేస్తూ ఉండడం కలిసి వచ్చాయి అనుకోవచ్చు.
బాక్సాఫీస్ వద్ద అధ్బుత విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. మహేష్ కెరీర్ లో ఒకానొక పెద్ద హిట్ గా నిలిచిపోయింది. మణిశర్మ రూపొందించిన పాటలన్నీ కూడా పాపులర్ అవ్వడం విశేషం. ‘రామ సక్కనోడమ్మ సందమామ’, ‘బాలీవుడ్ బాలరాజుని’, ‘గోదారి గట్టుపైన చిన్నారి చిలక ఉంది’, ‘ఇందురుడో చందురుడో మామ’ అన్నీ జనాల్లోకి బాగా వెళ్ళాయి. వైజయంతీ బ్యానర్ లో రాఘవేంద్రరావ్ గారికి ఈ మూవీ ఒక పెద్ద మెమరబుల్ హిట్ గా మిగిలిపోయింది అని చెప్పుకోవచ్చు.
Leave a comment