హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ ఉంటాం. అదే అప్పటికే స్టార్స్ అయిన వాళ్ళ పిల్లలు కూడా హీరో, హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో సెట్ అయిపోవడం. వాళ్ళకి అభిమానుల తరపు నుండి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఉండటంతో నిర్మాతలు ఎంత బడ్జెట్ లో నైనా సినిమాలకు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ, కొత్తగా ఇండస్ట్రీలోకి ఎలాంటి సహకారం లేకుండా.. కేవలం నటన మీద ఇష్టంతో వచ్చిన వాళ్ళకి ఎదగడం చాలా కష్టమైపోతుంది అని చెప్పొచ్చు. అయినా అలాంటి పరిస్తితులని ఓపిగ్గా దాటుకుని వచ్చి.. తమని తాము నిరూపించుకున్న నటులు కొంతమంది అన్ని భాషలకి చెందిన ఇండస్ట్రీల లోనూ ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళ గురించి, అలాగే ప్రస్తుతం ఫేమ్ లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం.
ముందుగా తమిళ సినీ తెరమీద కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకోవాలి. విజయ్ సేతుపతికి సినీ వర్గం నుంచి ఎలాంటి సహకారం కూడా లేదు. ధనుష్ చేస్తున్న సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఇండస్ట్రీలో చాలాకాలం పెద్ద అవకాశం కోసం ఎదురుచూశాడు. ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటన మీద తనకి ఉన్న కసినంతా చూపిస్తున్నాడు. ఎన్నో అవార్డులని కూడా గెలుచుకుంటున్నాడు. ఒకప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ బిజీగా గడిపేసిన అతను ప్రస్తుతం తనచుట్టూ అవకాశాలు ఇస్తామని తిరిగేవాళ్ళతో బిజీగా గడిపేస్తున్నాడు.
తర్వాత మన తెలుగు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ చాలా ప్రత్యేకం. ఇప్పటిదాకా తెలుగు సినిమాలో హీరో అంటే అతను ఎవడో ఒక హీరోకి కొడుకైనా, చుట్టమైనా అయి ఉంటాడు. లేదా కనీసం దూరపు బంధువైనా అయి ఉంటాడు. కానీ, అసలెవ్వరూ తెలియని వాళ్ళు కూడా.. దొరికిన ఒక్కగానొక్క అవకాశాన్ని వినియోగించుకుని ఇప్పుడు ఆ స్టార్ల పిల్లలందరికీ పెద్ద కాంపిటీషన్ గా నిలబడిన విజయ్ దేవరకొండ రియల్ హీరో అనే చెప్పాలి. అందరితోనూ చాలావరకు బాగానే కలిసిపోయే విజయ్ టాప్ హీరోగా చాలాకాలం కొనసాగాలని కోరుకుందాం.
ఇక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యష్ ది కూడా దాదాపు అదే పరిస్తితి. తండ్రి బస్ కండెక్టర్. అతి సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆ నేపథ్యం నుండి వచ్చి అక్కడున్న చిన్న స్థాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తిష్ట వేసుకుని ఉన్న స్టార్ల పిల్లలతో పోటీపడుతూ తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ఆ ఇండస్ట్రీని దాటేసి One of the biggest PAN India star ఐపోయాడు యష్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నమ్మే యష్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. వీళ్ళని స్పూర్తిగా తీసుకుని నటనని నిజంగా ప్రేమించేవాళ్ళు ఇండస్ట్రీలో గట్టిగా కృషి చేసి సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. పస లేని కళని బలవంతంగా మీద రుద్దుకోవడం కన్నా, నిజమైన టాలెంట్ ని సపోర్ట్ చేయడం వల్ల ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వొచ్చు అనే ఊహకి ఆయువు ఇచ్చిన వాళ్ళం అవుతాం.
Leave a comment