Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, అందాల భామ కృతి సనన్ సీతగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి అంతటా మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ భారీగానే రాబట్టిన ఈ చిత్రం తర్వాతి రోజు నుండి డీలా పడింది. ఇక ఈ సినిమాపై ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆదిపురుష్ లోని రాముడు, రావణుడి పాత్రల్ని వీడియో గేమ్ గా చిత్రీకరించారని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధ పెట్టే విధంగా ఉందని, తక్షణం ఈ సినిమాని ఆపేయాలంటూ మోడీకి లేఖ కూడా రాసారు.
చిత్ర దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషిర్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని చెప్పిన ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్, భవిష్యత్తులో ఈ సినిమా ఓటీటీలోకి కూడా రాకుండా చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరింది. అయితే ఒకవైపు ఈ చిత్రం ఇంత విమర్శలు మూటగట్టుకుంటుండగా, జిల్లా కలెక్టర్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ నరసరావు పేటలోని అనాథ పిల్లలు, సోషల్ వెల్ఫేర్ విద్యార్థినీ, విద్యార్థులకు ఈ సినిమాని చూపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకు విజేత థియేటర్ లో ఈ సినిమాని త్రీడీ ఫార్మాట్లోఆయన చూపించారు. విద్యార్ధులతో పాటు కలెక్టర్ సినిమాని వీక్షించడం మరో విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాపై ఇంత దారుణమైన విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ రారాజుగా మారతాడని అనుకోగా, వారి ఆశలు అన్ని అడియాశలు అయ్యాయని చెప్పాలి.