Virender Sehwag: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రంకి కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. అలానే ఈ సినిమాపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సినిమాని థియేటర్, ఓటీటీల్లో బ్యాన్ చేయమని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించగా, పది తలల రావణుడిగా సైఫ్అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్, భజరంగ్ హనుమంతుడి పాత్రలో మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. అయితే చిత్రంలో రావణుడి పాత్రపై అనేక విమర్శలు వచ్చాయి. రావణుడి తలలు రెండు వరసులలో ఉంచే సీన్ పై బీభత్సమైన ట్రోలింగ్ నడుస్తోంది.
ఇది వాల్మీకి రామాయణం కాదు ఓం రౌత్ అంటూ అతనిని తిట్టిపోస్తున్నారు. కొన్ని చోట్ల సినిమాని బ్యాన్ చేయాలంటూ మోడీకి లేఖలు కూడా రాస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ ఆదిపురుష్‌కి పోలిక లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక చిత్రంలో హనుమంతుడు సంభాషణలపై తీవ్ర దుమారం రేగడంతో చిత్రబృందం వాటిని మార్చిన విషయం తెలిసిందే.ఇప్పటికీ సినిమాపై విమర్శలు కురిపిస్తున్నారు లేకపోలేదు. తాజాగా భారతీయ క్రికెట్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు.
నాకు ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైందంటూ’ స్మైల్ ఎమోజీతో తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్‌ని కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరి కొందరు వీరూని విమర్శిస్తున్నారు. అయితే సినిమా కథని పూర్తిగా మార్చేయడం వల్లనే సినిమా విమర్శిస్తున్నారు తప్ప మరో విషయం లేదు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టినప్పటికీ తర్వాత తర్వాత తేలిపోయింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయిన ‘ఆదిపురుష్’ ఈ వీకెండ్లో రాబట్టే కలెక్షన్లను బట్టి… సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనేది తెలుస్తుంది.