Mini Varahi: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్నవరం నుంచి మొదలైన జనసేనాని వారాహి యాత్ర కోనసీమ జిల్లా దాటుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. వారాహి వాహనం మీదెక్కి పవన్‌కళ్యాణ్ ప్రసంగిస్తుంటే ఆయనని చూసేందుకు చుట్ట పక్కల నుండి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అసలు వారాహి వాహనం రోడ్డు మీదకు రాకముందే ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు రేపింది. ఇక ప్రస్తుతం వారాహి యాత్రలో పవన్‌కళ్యాణ్‌కు జనసైనికులు, వీర మహిళలు హారతులు పడుతున్నారు. ఈ యాత్ర జనసేన పార్టీలో కొత్త ఊపు తెచ్చిందనే చెప్పాలి.
పవన్ యాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు కొందరు అభిమానులు బహుమతులు ఇస్తూ వస్తున్నారు. వాటిని పవన్ కళ్యాణ్ ప్రేమగా స్వీకరిస్తున్నారు. రీసెంట్గా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంకి చెందిన జనసేన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు పవన్ కళ్యాణ్‌కి మినీ వారాహి తయారు చేసి దానిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. మలికిపురం సభ సమయానికి ముందు జనసేనానికి వినూత్న బహుమతి ఇవ్వాలని భావించిన జగదీష్ 10 రోజులు కష్టపడి మినీ వారాహి వాహనాన్ని తయారు చేశాడు. పవన్‌కళ్యాణ్‌పై తనకున్న అభిమానంతో ఆయనకు బహుమతిగా ఇవ్వాలనే ఈ వాహనాన్ని తయారుచేశానని జగదీష్ అంటున్నాడు.
జగదీష్ ప్రతిభ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయనని పిలిపించుకొని అభినందించారు. జగదీష్ తాను తయారుచేసిన రిమోట్ కారును పవన్ కళ్యాణ్ ఎదుట ప్రదర్శించి అతనికి బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే వన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా ఆయనకు అభిమానులు వివిధ రూపాల్లో గిఫ్ట్ లు అందిస్తుండగా, వాటిని ఆప్యాయంగా అందుకుంటున్నారు. అభిమానులపై ప్రేమ చూపుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు.