Sr NTR Food Habits: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు జాతిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనుడు. సినిమాలు, రాజకీయాలతో తెలుగు ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారు అన్నగారు. ఆయన శత జయంతి ఉత్సవాలని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. సినిమా పరిశ్రమకి క్రమ శిక్షణ నేర్పించిన ఎన్టీఆర్‌ని కొందరు దేవుడిగా కూడా కొలుస్తుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎవరు అంటే ముందుగా అన్నగారి పేరు జ్ఞప్తికి వస్తుంది.అయితే ఎన్టీఆర్ ఒకపక్క సినిమాలు మరొక రాజకీయాల్లోతో బిజీగా ఉన్నప్పటికీ ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించేవారని అప్పట్లో కథలు కథలు గా చెప్పుకునేవారు.
ఉదయం 4 గంటలకు నిద్రలేచే ఎన్టీఆర్ రెండు గంటల పాటు తప్పక వ్యాయామం చేసేవారట. ఇక బ్రేక్ ఫాస్ట్ లో బాగా నెయ్యి వేసుకొని అరచేతి మందంలో ఉండే రెండు డజన్లు(24) ఇడ్లీలు లాగించేవారట. షూటింగ్స్ కోసం వేరే ప్రాంతాలకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అక్కడ బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీలు కుదరకపోతే అప్పుడు భోజనం చేసేవారట. ఈ భోజనంలో కచ్చితంగా నాటుకోడి మాంసం ఉండాల్సిందేనట. ఇక ప్రతి రోజు సాయంత్రం పూట 2 లీటర్ల బాదం పాలు తాగాల్సిందేనట. చెన్నైలో ఉన్నప్పుడు అన్నగారు బజ్జీలు ఎక్కువగా తినేవారు.
వేడి వేడి బజ్జీలు దాదాపు 40 వరకు తినేవారటని ఆయనకి సన్నిహతంగా ఉండేవారు చెప్పుకొచ్చారు. మనం సంతోషంగా ఉన్నప్పుడే అంతా సాఫీగా సాగుతుందని ఎన్టీఆర్ నమ్మేవారు. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు గురించి, ఆయన మంచి తనం గురించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఎంతో మంది వ్యక్తులు ఏదో ఒక సమయంలో చర్చిస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చాక ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదవారికి అండగా నిలిచారు.ఇప్పటికీ కూడా చాలా మంది ఇళ్లల్లో ఎన్టీఆర్ ఫొటోలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి.