Editor Gautham Raju: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటి మీనా భర్త విద్యా సాగర్ మరణవార్త ఇంకా మర్చిపోకముందే బుధవారం (జూలై 6) ఉదయం ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు ఇకలేరు అనే వార్తతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజాయిన కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఒంగోలు వారి స్వస్థలం. గౌతంరాజుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. 800కి పైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటింగ్ చేశారు. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్’ ఇలా ఎన్నో సినిమాలను ఆయన ఎడిట్ చేశారు.
మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ ఆయన చివరి చిత్రం. 40 సంవత్సరాల కెరీర్లో ఆరు నందులు అందుకున్నారు. గౌతంరాజు శిష్యులు పలువురు ఇండస్ట్రీలో ఎడిటర్లుగా రాణిస్తున్నారు. గౌతంరాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Leave a comment