Aunu Valliddaru Ishta Paddaru: మెగాస్టార్ చిరంజీవి తర్వాత జనరేషన్లో.. ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, చిన్నాచితకా క్యారెక్టర్లు చేస్తూ.. ఎంతో కష్టపడి పైకొచ్చాడు రవితేజ.. తనకి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది..
తర్వాత వంశీ దర్శకత్వంలో చేసిన ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసింది. రవితేజ, కళ్యాణి హీరో హీరోయిన్లుగా.. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వంశీ దర్శకత్వంలో.. వల్లూరిపల్లి రమేష్ నిర్మించిన సూపర్ హిట్ లవ్ ఎంటర్టైనర్ ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’..
ఈ మూవీ 2002 ఆగస్టు 2న రిలీజ్ అయ్యింది. 2022 ఆగస్టు 2 నాటికి సక్సెస్ ఫుల్‌గా 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ విశేషాలు ఓసారి చూద్దాం..
గూడురు విశ్వనాథ శాస్త్రి కథా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.. మోరంపూడి అనిల్ (రవితేజ) డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం సిటీకొస్తాడు.. ఎక్కడా తనకి నచ్చిన ఉద్యోగం దొరకదు.. ఒక కంపెనీ యజమాని తన నిజాయితీకి మెచ్చి నైట్ వాచ్మెన్ ఉద్యోగం ఇస్తాడు. ఇంటికోసం వెతుకుతుండగా.. స్వాతి (కళ్యాణి) ఉంటున్న గదినే కాలనీ ఓనర్ సత్యానందం (జీవా) అనిల్‌కి అద్దెకిస్తాడు.
ఉదయం స్వాతి ఆఫీసుకి వెళ్తే, అనిల్ గదిలో ఉంటాడు.. రాత్రి అనిల్ డ్యూటీకి వెళ్తే స్వాతి ఇంట్లో ఉంటుంది.. అలా కొన్నాళ్లకి తన గదిలో తను కాకుండా మరో వ్యక్తి ఉంటున్నాడనే విషయం స్వాతికి అర్థమవుతుంది. ఇద్దరూ లెటర్స్ ద్వారా మాట్లాడుటుకుంటుంటారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.. తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
జీవా, ఇస్త్రీ చేస్తూ ఐడియాలు అమ్మేవ్యక్తిగా మల్లికార్జున రావు, సత్యానందం బావమరిదిగా కృష్ణ భగవాన్, భార్య దగ్గర మెప్పుపొందాలని రకరకాల వ్యాపారాలు చేసి తన్నులు తినే పొట్టిరాజు.. ఇలా క్యారెక్టర్సన్నీ కూడా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాయి. మిగతా పాత్రల్లో ప్రసన్న, శివా రెడ్డి, బెనర్జీ, ఎమ్.ఎస్.నారాయణ, కోట, తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు కనిపిస్తారు.
చక్రి కంపోజ్ చేసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ప్రతి సన్నివేశంలోనూ వంశీ మార్క్ కనిపిస్తుంది. చిన్న సినిమాగా విడుదలై సంచలనం విజయం సాధించింది. బెస్ట్ యాక్ట్రెస్‌గా కళ్యాణికి, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గణపతికి నంది అవార్డులు వచ్చాయి. ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ మూవీకి వర్క్ చేసిన వారి కెరీర్లో మంచి మెమరీగా మిగిలిపోతుంది..
Leave a comment