Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగి ఎంతో మందికి అండగా నిలిచారు. ఆయన స్పూర్తితో ఎందరో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆరు పదుల వయస్సులోను ఇంకా ఎంతో హుషారుగా సినిమాలు చేస్తున్న చిరు మెగాస్టార్‌గా మారేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. చిరంజీవి ఈ స్థాయిలో నిలబడడం వెనక ఎంతో శ్రమ ఉంది. ఆయన ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వం. అన్ని విషయాలలో సహనంతో ఉండడం, వివాదాల జోలికి ఏ మాత్రం వెళ్లకుండా కూల్ అండ్ కామ్‌గా కెరీర్ ముందుకు సాగించడం ఒక్క చిరంజీవికే చెల్లింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు భరించడం వల్లనే చిరంజీవి ఇంత అణుకువగా ఉంటున్నాడని అందరు చెబుతుంటారు.
చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..చిన్న చిన్న పాత్రల్లో మెరిసారు. ఆ తర్వాత విలన్‌గా కూడా పలు సినిమాలు చేశారు. మల్టీ స్టారర్ చిత్రాలలో కూడా నటించి సత్తా చాటారు. అయితే ఒకసారి కోతల రాయుడు అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి సరైన టైంకి రాలేదట. చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ.. షూటింగ్ కి ఆలస్యంగా వచ్చినందుకు మెగాస్టార్‌పై పైర్ అయ్యారట. చెప్పిన టైం కి రాకుండా అందరిని ఇబ్బంది పెడతావా అంటూ ఆ రోజు మొత్తం మండే ఎండలో అతనిని నిలుచోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారట.
సినిమాలపై ఉన్న మక్కువతో పాటు నిర్మాతలపై ఉన్న గౌరవంతో చిరంజీవి ఆ రోజు మొత్తం ఎండలో నిలుచున్నాడట. ఈ విషయాన్ని ఆ చిత్రంలో చిన్న పాత్ర పోషించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆయన మాత్రం ఈ విషయం గురించి ఏ నాడు చెప్పలేదు. చిరంజీవికి చాలా సహనం ఎక్కువ అని, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా చిరు వాటిపై ఏ మాత్రం స్పందించరని పలువురు చెబుతుంటారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న చిరంజీవి పలు సేవా కార్యక్రమాలతోను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.