పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ డ్రామా సలార్ పార్ట్ 1 విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తోంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించిన వారిలో శ్రీయా రెడ్డి ఒకటి. జగపతిబాబు కూతురిగా పవర్ ఫుల్ రోల్‌ను ఆమె ప్లే చేసింది. ఈ నేపథ్యంలోనే శ్రీయా రెడ్డి గురించి సినీ ప్రియులు ఆరాలు తీస్తున్నారు.
అసలు శ్రీయా రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది..? హీరో విశాల్ ఆమెకు ఏం అవుతాడు..? శ్రీయా రెడ్డి భర్త ఎవరు..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1983 నవంబరు 28న తమిళనాడులోని చెన్నైలో శ్రీయా రెడ్డి జన్మించింది. ఆమె తండ్రి మరెవరో కాదు భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ భరత్ రెడ్డి. గుడ్ షెపర్డ్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించిన శ్రీయా రెడ్డి.. చెన్నైలోని ఇతిరాజ్ కళాశాలలో గ్రాడ్యువేట్ అయింది.అయితే స్కూలింగ్ డేస్ లో శ్రీయా రెడ్డికి మోడలింగ్ ఆఫర్లు వచ్చాయి. కానీ, తండ్రి చదువు పూర్తి చేయమని చెప్పడంతో.. ఆ ఆఫర్లను ఆమె తిరస్కరించింది.
కాలేజీ డేస్ లో ప్రముఖ సంగీత ఛానల్ సదరన్ స్పైస్ మ్యూజిక్ కోసం ఆమెకు ఆడీషన్ ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో చదువుకుంటూనే VJ అవుతానని ఆమె తన తండ్రిని ఒప్పించగలిగింది. ఆపై సదరన్ స్పైస్ మ్యూజిక్ ఆడీషన్ లో సెలక్ట్ అయిన శ్రీయా రెడ్డి.. వీజేగా కెరీర్ ప్రారంభించి అత్యంత ప్రజాదరణ పొందింది.ఈ క్రమంలోనే ఆమెకు సినిమా ఛాన్సులు రావడం స్టార్ట్ అయ్యాయి. తండ్రికి ఇష్టం లేనప్పటికీ శ్రీయా రెడ్డి తెలుగులో అప్పుడప్పుడు`అనే మూవీకి సైన్ చేసింది. చంద్ర సిద్ధార్థ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. రాజా హీరోగా యాక్ట్ చేశాడు. అయితే శ్రీయా రెడ్డి మొదట సంతకం చేసింది తెలుగు సినిమానే అయినా కూడా విడుదలైంది మాత్రం తమిళ చిత్రం `సమురాయ్. అప్పుడప్పుడు చిత్రం 2003లో రిలీజ్ అయింది. కానీ, అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఆపై అమ్మ చెప్పింది అనే సినిమాలో ఆమె కనిపించింది. డస్కీ స్కిన్ టోన్ కారణంగా తెలుగులో శ్రీయా రెడ్డికి పెద్దగా ఛాన్సులు రాలేదు.
దాంతో కోలీవుడ్ లోనే శ్రీయా రెడ్డి బిజీ అయింది. 2008 వరకు హీరోయిన్గా, సహాయక నటిగా సినిమాలు చేసింది. పొగరు, కంచివరం వంటి చిత్రాలు నటిగా శ్రీయా రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకటిరెండు మలయాళ సినిమాల్లోనూ ఆమె నటించింది.కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో శ్రీయా రెడ్డి ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడమే అందుకు కారణం. విక్రమ్ కృష్ణను శ్రీయా వివాహం చేసుకుంది. 2008లో చెన్నైలోని పార్క్ షెరటన్ హోటల్లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఇకపోతే విక్రమ్ కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే.
ప్రముఖ సినీ నిర్మాత GK రెడ్డి కుమారుడు మరియు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సోదరుడైన విక్రమ్ కృష్ణ కోలీవుడ్ లో నిర్మాతగా సత్తా చాటుతున్నారు.నిర్మాతగా మారడానికి ముందు విక్రమ్ కృష్ణ రెండు తమిళ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత GK ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యారు. ప్రధానంగా తన తమ్ముడు విశాల్ చిత్రాలను ఆయన నిర్మిస్తారు. ఇక విక్రమ్ కృష్ణను వివాహం చేసుకోవడంతో.. విశాల్ కు శ్రీయా రెడ్డి వదిన అయింది. పెళ్లి తర్వత నటనకు బ్రేక్ ఇచ్చిన శ్రీయా రెడ్డి భర్తతో కలిసి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చింది. అమాలియా అనే అమ్మాయికి జన్మనిచ్చింది.
దాదాపు పదేళ్లు గ్యాప్ తర్వాత 2018లో శ్రీయా రెడ్డి మళ్లీ సమ్ టైమ్స్ అనే తమిళ చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ వెబ్ సిరీస్ లో కనిపించిన శ్రీయా రెడ్డి.. తాజాగా సలార్ తో ఆకట్టుకుంది. పార్ట్ 2లో కూడా ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలోనూ శ్రీయా రెడ్డి కీలక పాత్రను పోషిస్తోంది.