మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఎన్నో అంచనాలు, బాధ్యతలతో రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నటన, పట్టుదల, శ్రమతో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. దేశ, విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పట్టుమని పది హిట్లు కూడా లేని రామ్ చరణ్ గ్లోబర్ స్టార్ ఎలా అయ్యాడు..? అసలు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశాడు..? కెరీర్ ఆరంభంలో ఎదురైన అవమానాలు ఏంటి..? చరణ్ రిజెక్ట్ చేసిన చిత్రాలు ఏవి..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ఇక్కడ తెలుసుకుందాం.
1985 మార్చి 27న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు చెన్నైలో రామ్ చరణ్ తేజ జన్మించాడు. నటనపై ఉన్న ఆసక్తితో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి హీరోలు స్టార్ డమ్ సాధించారు. హిట్లు మీద హిట్లు కొడుతూ నువ్వా నేనా అన్నట్లు కుమ్మేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొన్న సమయంలో చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి అప్పగించారు చిరంజీవి.
అలా 2007లో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిరుత మూవీతో రామ్ చరణ్ హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఇందులో నేహా శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన చిరుత హిట్ గా నిలిచింది. ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా చరణ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. రామ్ చరణ్ రెండో సినిమా మగధీర. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 2009లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది.రెండో సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ అయిపోయాడు. కానీ, ఆ తర్వాతే ఆయనకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మగధీర అనంతరం చరణ్ తన బాబాయ్ నాగబాబు నిర్మాణంలో ఆరెంజ్ మూవీ చేశాడు. 2010లో విడుదలైన ఆరెంజ్ డిజాస్టర్ అయింది. 2011లో సంపత్ నంది తెరకెక్కించిన రచ్చ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా పోయింది. రెండు ఫ్లాపులు అనంతరం ఏడాది గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. 2013లో జంజీర్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన జంజీర్ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు అప్పట్లో చెక్క ముఖం హీరో అంటూ నార్త్ సినీ ప్రియులు, బాలీవుడ్ మీడియా చరణ్‌ను ఘోరంగా అవమానించారు. చరణ్ కి నటన రాదని సర్టిఫికెట్ జారీ చేశారు. జంజీర్ మూవీ రామ్ చరణ్ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసింది.అవమానాలు, విమర్శుల కారణంగా చరణ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. అలా అని వెనకడుగు వేయలేదు. ఫ్లాపులకు కృంగిపోలేదు. తన టాలెంట్‌ను నమ్ముకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. 2018లో విడుదలైన రంగస్థలం మూవీతో సంపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ ప్రతిభ ఖండాలు దాటింది.
రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతమైన నటనను కనబరిచి ప్రపంచాన్ని తన మాయలో పడేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలో ఎవరైతే తనకు యాక్టింగ్ రాదని ఘోరంగా అవమానించారో వారందరి చేత గ్రేట్ యాక్టర్ అని అనిపించుకున్నాడు. హాలీవుడ్ ను సైతం ఫిదా చేశాడు. గుడ్ మార్నింగ్ అమెరికా వంటి ప్రఖ్యాత షోకి అతిథిగా ఆహ్వానించబడ్డాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లి హెడ్ లైన్స్‌లో నిలిచాడు. 17 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో రామ్ చరణ్ మొత్తం 14 చిత్రాల్లో నటించాడు. ఈ జాబితాలో చిరుత, మగధీర, ఆరెంజ్, రచ్చ, నాయక్, జంజీర్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ – ది ఫైటర్, ధృవ, రంగస్థలం, వినయ విధేయ రామ, ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలు ఉన్నాయి. వీటిలో విజయం సాధించినవి కేవలం 7 చిత్రాలు మాత్రమే. చిరుత, నాయక్, ఎవడు, ధృవ చిత్రాలు హిట్ అవ్వగా.. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
కెరీర్ మొత్తంలో పట్టుమని పది హిట్లు లేకపోయినా.. తన ప్రతిభతో ప్రాంతీయ స్టార్ నుంచి గ్లోబర్ స్టార్ గా ఎదిగాడు. విమర్శలను సవాళ్లుగా స్వీకరించి దేశం గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అనే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి చేరుకున్నారు. అలాగే చిన్నవయసులో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్నారు. ఇక రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల విషయానికి వస్తే.. డార్లింగ్, శ్రీమంతుడు, ఏజెంట్, సూర్య S/o కృష్ణన్, ఒకే బంగారం, నేట టిక్కెట్టు, కృష్ణార్జున యుద్ధం, లీడర్ వంటి చిత్రాలను ఆయన వదులుకున్నాడు. బిజీ షెడ్యూల్ వల్లనో లేక కథ నచ్చకో ఆయా చిత్రాలకు చరణ్ నో చెప్పాడు. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన వాటిలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.