ఆయన సినిమాలు చిరంజీవిని మరింత గొప్ప స్టార్ ని చేశాయి. వ్యక్తిగతంగా, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని పిలిపించుకునే స్థాయిలో ఆయన్ని కూర్చోబెట్టాయి. ఆయన సినిమా సక్సెస్ రేట్ అలాంటిది. ముఖ్యంగా చిరంజీవితో చేసిన సినిమాలు అన్నీ పెద్ద హిట్లుగా నిలిచాయి. న్యాయం కావాలి, ఖైదీ, అభిలాష, గూండా, ఛాలెంజ్, దొంగ, రాక్షసుడు, పసివాడి ప్రాణం, దొంగ మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ. ముఠా మేస్త్రీ ఇలా చిరుతో చేసిన సినిమాలన్నీ మంచి హిట్లుగా నిలిచాయి.
1980 లో మొదలయిన ఆయన సినీ ప్రస్థానం 2009 వరకు సాగింది. ఈయన సినిమాల్లో ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగా సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అభిలాష, ఛాలెంజ్, రక్త సింధూరం, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, రాక్షసుడు, దొంగ మొగుడు, మరణ మృదంగం, రక్తాభిషేకం ఈ సినిమాలన్నీ ఆ రచయిత నవలల ఆధారంగా తీసుకున్నవే. అవన్నీ కూడా హిట్స్ అవడం విశేషం.
ఇక స్వయంగా నిర్మాతగా కూడా ఆయన చాలా సినిమాలకే వ్యవహరించారు. 2013 లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గా బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి నేషనల్ అవార్డ్ తీసుకున్నారు కోదండరామి రెడ్డి. ఆయనకి ఇద్దరు కొడుకులు. సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి. సినిమాల్లో ఆయనకి ఉన్న ప్రవేశంతో తన చిన్న కొడుకైన వైభవ్ ని 2007 లో ‘గొడవ’ పేరుతో లాంచ్ చేసారు. మరో విశేషం ఏమిటంటే కోదండరామిరెడ్డి పెద్ద కొడుకే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కానీ, ఆ తరువాత సునీల్ వ్యాపారంలో స్థిరపడగా, వైభవ్ తన అదృష్టాన్ని తమిళ సినిమాల్లో నిరూపించుకోగలిగాడు. అక్కడ పెద్ద స్టార్ గా కూడా ఎదిగిపోయాడు.
ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయడంలో రామి రెడ్డి గారి పాత్ర ఉంది. తీసిన 94 సినిమాల్లో 90% సక్సెస్ రేట్ సాధించిన వ్యక్తి ఆయన. 1950 జూలై 1 న జన్మించిన కోదండ రామి రెడ్డి గారికి నేటితో 71 ఏళ్లు నిండాయి.
Leave a comment