మా ఎన్నికల సంధర్భంగా స్పందించడానికి మురళీ మోహన్ కూడా ముందుకు వచ్చారు. ఈ మధ్య ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ఎన్నికలకు సంబంధించిన విషయాలని ప్రస్తావించారు. గతంలో స్వయంగా ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసిన మురళి మోహన్ కి ఈ అనుభవం చాలా వింతగా అనిపిస్తున్నట్లు చెప్పారు.
గతంలో తాను పనిచేసినపుడు ఇలా లేదని.. ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలా అందరూ అధ్యక్ష పదవి కోసం పోరాడుతున్నారని ఆయన మాట్లాడారు. అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్లు కాబట్టి.. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త అనుకూలంగా ఉండేదని.. ఇప్పుడు మా సభ్యత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళందరినీ నియంత్రించే పరిస్తితి లేదని ఆయన మాట్లాడారు.
ఈ సమస్యలకి పరిష్కారం చెప్పడం కోసం నా వంతుగా అందరూ పెద్దలతో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని, అసలు ఇలాంటి ఎన్నికలు లేకుండా.. ఏకగ్రీవంగా ఒకరిని అధ్యక్షులని చేసి.. వారికి తోడుగా ఒక మంచి కమిటీని నియమించి క్రమశిక్షణలో నడిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం.. మా లో ప్రముఖులైన వ్యక్తులు అందరితోనూ చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇప్పటికే మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఐదు మంది రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వల్ల గొడవలు పెరుగుతున్నాయని మురళీ మోహన్ చెప్తున్నా.. అసలు మా సభ్యులకి కనీసం ఎవరిని ఎంచుకోవాలో అన్న స్వేచ్ఛ కూడా లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలనుకుంటే అది మరింత గొడవలకు దారి తీస్తుందని కొందరి అభిప్రాయం.
Leave a comment