శివసామిగా ధనుష్ చెప్పిన కథనే వెంకటేష్ మనకు నారప్పగా చెప్పాలని అనుకున్నారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో.. తన కెరీర్ లోనే ఇది బెస్ట్ కమర్షియల్ సినిమా అవబోతుందని చెప్పాడు వెంకటేష్. ధనుష్ నటనకి గాను వచ్చిన జాతీయ స్థాయి గుర్తింపు కూడా వెంకటేష్ గారిని ఈ కథని ఎంచుకునేలా చేసి ఉండవచ్చు. ఇప్పటికే ఫ్యామిలీ మేన్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్.. అదే ఫ్యామిలీని కాపాడుకునే నేపథ్యం ఉన్న కథ అయినప్పటికీ ఇందులో కొన్ని సామాజిక అంశాలని ఎక్కువగా టచ్ చేయడం ఉంటుంది. తమిళ్ లో ఈ విషయం పట్ల ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినందువల్ల అక్కడ ఇలాంటి కథలకి ప్రేక్షకుల నుండి అంత వ్యతిరేఖత ఉండదు. వెనకబడ్డ కులానికి చెందిన వాడుగా ప్రధాన పాత్ర, ఆధిపత్య కులస్తుల చేతిలో ఎలా అణచివేతకు, అవహేళనకు గురయ్యాయి అనేది చెప్పడం, చివరగా ఆ పాత్ర తన పిల్లలకి తన జీవితం నుండి ఏం నేర్పిస్తుంది అనేది కథాంశం.
ఐతే, ఇప్పుడు తమిళ్ లో వచ్చిన అసురన్ కి, తెలుగులోని నారప్పకి ఏమైనా తేడాలు ఉన్నాయేమో చెప్పాలి. సూక్ష్మంగా ఏమో కానీ, స్థూలంగా మాత్రం రెండిటికీ ఎలాంటి తేడాలు కూడా లేవు. శ్రీకాంత్ అడ్డాల దాదాపు నాలుగేళ్ల తర్వాత చేస్తున్న అసురన్ ఒరిజినల్ ని నిర్వీర్యం చేయలేదు. ప్రతి సీన్, ప్రతి షాట్, ప్రతి డైలాగ్ కూడా ఏ మాత్రం మార్చకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అటు ఒరిజినల్ ఫిల్మ్ లోనూ.. ఇటు రీమేక్ లోనూ దాదాపు పాత్రల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. రెండిటిలోనూ కులం అనే మాట ఎక్కువగా ఉపయోగించకుండా కథని, అందులో ఎమోషన్స్ ని కన్వే చేయడంలో దర్శకులు విజయవంతం అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాలకి ఇలాంటి కథలని తెరకెక్కించడం అలవాటు లేని పనే అని చెప్పాలి. అలాంటి శ్రీకాంత్ కూడా ఈ కథని ఓన్ చేసుకుని, తన కంఫర్ట్ జోన్ లోంచి బయటికి వచ్చి ఈ తీయడం అనేది గొప్ప విషయమేనని చెప్పాలి.
వెంకీ తన గతంలో చేసిన పాత్ర అంతగా సూట్ అవలేదని చెప్పాలి. 20లలోని యువకుడిగా ధనుష్ ని చూసినట్టు, వెంకటేష్ గారిని చూడటం కాస్త కష్టమే. వెంకటేష్ తో పాటు.. అతని భార్య సుందరమ్మగా నటించిన ప్రియమణి కూడా ఈ పాత్రలో ఒదిగిపోయింది. అసురన్ లో చేసిన మంజు వారియర్ కి ఏ మాత్రం తీసిపోను అనిపించుకుంది. వాళ్ళ పిల్లలుగా చేసిన వాళ్ళు కూడా చాలావరకు ఒదిగిపోయారు. అలాగే రాజీవ్ కనకాల కూడా తన వంతు పాత్ర పోషించారు. ప్రియమణి బ్రదర్ గా, వెంకటేష్ కి బావగా చక్కగా వదిగిపోయిన రాజీవ్ కనకాల మంచి నటుడిగా మరోసారి నిరూపించుకున్నారు. కానీ, సపోర్టింగ్ రోల్స్ విషయంలో కథ ఒరిజినల్ అంత గొప్పగా కన్వే అవలేదని చెప్పచ్చు. ముఖ్యంగా రావు రమేష్ ప్రకాష్ రాజ్ స్థానంలో చేయడం జరిగింది.
ఇప్పటికే తమిళ్ అసురన్ చూడనివారికి నారప్ప ఎక్కువ ప్రభావం చూపించొచ్చు. కారంచేడు వంటి నిజజీవిత ఘటనలు మన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ కథ పట్ల చాలామంది ఆలోచించగలిగే అవకాశం ఉంది. శ్రీకాంత్ ఉద్దేశపూర్వకంగానే సీన్ టూ సీన్ తీసినప్పటికీ రీమేక్ లో సోల్ మిస్ అయిందని అనుకోవచ్చు. అయినా ఇలాంటి కథలని కూడా చెప్పవలసిన అవసరాన్ని గుర్తించిన వాళ్ళ ప్రయత్నానికి మెచ్చుకోవాలి. అణిచివేయబడిన వర్గాల కష్టాలపై కాస్త అవగాహన తీసుకొచ్చే సినిమా ఇది. మణిశర్మ మ్యూజిక్ ఒక మైనస్ కథని దృష్టిలో పెట్టుకుంటే. ఒరిజినల్ గా తీసుకున్న ట్రాక్స్ చాలావరకు లైఫ్ ఇస్తాయి.
Filmy Looks Rating : 3.75
Leave a comment