ఏడాదికి ఒకసారి ఇచ్చే జాతీయ అవార్డ్ ని కనీసం ఒక్కసారి తీసుకున్నా.. వాళ్ళ నటనా జీవితానికి ఒక సార్ధకత దొరికినట్టు భావిస్తారు నటీ నటులు. అందుకే జాతీయ అవార్డులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అది గెలుచుకునేంత గొప్పగా నటించడాన్ని పెద్ద లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ, అదేమంత సులువైన పని కాదు.. ఆమెరికాలోలా కాకుండా.. ఇక్కడ ఒకటికి మించిన సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కో భాష మాట్లాడేవాళ్ళకి ఒక్కో పరిశ్రమ ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఉన్న నాలుగు పెద్ద రాష్ట్రాలకీ నాలుగు ప్రత్యేక భాషలు, ఫలితంగా ప్రత్యేకమైన సినీ పరిశ్రమలు ఉన్నాయి. అందుకే ఉత్తమ నటుడిగా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్న విషయంలో ఎన్నో విషయాలని కన్సిడర్ చేయడం జరుగుతుంది.
ఐతే, దేశంలో అన్నిటికన్నా పెద్ద సినీ పరిశ్రమ ఐన బాలీవుడ్ కి చెందిన నటీ నటులకే ఎక్కువగా ఈ అవార్డ్ లని ఇస్తున్నారన్న ఒక అపవాదు ఉంది. కొన్ని సందర్భాలలో ఈ అవార్డ్ లు వివాదాస్పదం అయినప్పటికీ.. ఈ అవార్డ్ ల బోర్డు న్యాయంగా చాలాసార్లు వేరే భాషలు.. అంటే తమిళ, మలయాళ వాళ్ళకు కూడా ఇవ్వడం గమనించవచ్చు. అంటే ఇందులో పెద్దగా రాజకీయాలు లేవనే చెప్పాలి. ఐనా, 26 సార్లు హిందీ చిత్ర పరిశ్రమకే ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆ స్థాయిలో మలయాళ చిత్ర పరిశ్రమకి 13 సార్లు, తమిళ పరిశ్రమకి 10 సార్లు దక్కిందని చెప్పుకోవచ్చు. విశేషం ఏమిటంటే.. ఇప్పటిదాకా తెలుగులో ఒక్క ప్రధాన హీరోకి కూడా నేషనల్ అవార్డ్ రాలేదు.
వ్యక్తిగతంగా ఎక్కువసార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ తీసుకున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఇవి అమితాబ్ తన కెరీర్ బిగినింగ్ తీస్కున్నవి కాకపోవడం విశేషం. ఒక్క అవార్డ్ మాత్రమే 1990 లో వచ్చింది. మిగతా మూడు 2005, 2009, 2015 లలో వచ్చినవే. తర్వాత అత్యధికంగా తమిళ్ నుండి కమల్ హాసన్, మలయాళం నుండి మమ్ముట్టి మూడుసార్లు జాతీయ అవార్డ్ లని గెలుచుకున్నారు. అలాగే రెండు సార్లు గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సంజీవ్ కుమార్, ఓం పురి, నజీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, అజయ్ దేవగన్, ధనుష్. వీళ్లలోనూ హిందీ, మలయాళం, తమిళ్ వాళ్ళే తప్ప కన్నడ, తెలుగు పరిశ్రమల నుండి ఒక్కరూ కూడా జాతీయ అవార్డ్ గెలుచుకోలేదు అన్నది కఠిన వాస్తవం!
Leave a comment