ఒకప్పటి హీరోయిన్ సమీరా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సమీరా రెడ్డి సుపరిచితమే. కెరీర్ ఆరంభం నుంచే అగ్రహీరోలతో ఆడిపాడిన సమీరా రెడ్డి.. వరుస ఆఫర్లతో హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైంది. అసలు సమీరా రెడ్డి సడెన్ గా సినిమాలెందుకు మానేసింది..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? భర్త ఎవరు..? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సమీరా నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుందా..? వంటి అనేక ఆసక్తికర విషయాలను ఈ ఇక్కడ తెలుసుకుందాం.
1982 డిసెంబరు 14 న సమీరా రెడ్డి రాజమండ్రిలో జన్మించింది. అయితే పెరిగింది మాత్రం ముంబైలోనే. సమీరా రెడ్డి తండ్రి చింతా పోలి రెడ్డి మన తెలుగువారే. ఈయన వ్యాపారవేత్త. అలాగే తల్లి నక్షత్ర రెడ్డి మంగళూరుకు చెందినవారు కాగా.. ఆమె మైక్రోబయాలజిస్ట్. సమీరాకు ఇద్దరు తోబుట్టువులు. పెద్ద అక్క మేఘన రెడ్డి మాజీ VJ మరియు మోడల్. రెండో అక్క సుష్మా రెడ్డి బాలీవుడ్ నటి మరియు మోడల్. ముంబైలో సమీరా రెడ్డి తన విద్యాభాస్యాన్ని పూర్తి చేసింది. పాఠశాల విద్యను ముంబై మహిమ్‌లోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో చదివింది. సిడెన్‌హామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే మొడలింగ్ ప్రారంభించిన సమీరా..1997లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ యొక్క ఔర్ ఆహిస్తా మ్యూజిక్ వీడియోతో తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది. ఈ మ్యూజిక్ వీడియో సమీరా రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
2000ల ప్రారంభంలో శరవణ సుబ్బయ్య యొక్క తమిళ చిత్రం సిటిజన్‌లో నటిగా సమీరా అరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించారు. 2002లో మైనే దిల్ తుజ్కో దియా మూవీతో హీరోయిన్ గా సమీరా రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలో దర్నా మనా హై, ప్లాన్, ముసాఫిర్, నో ఎంట్రీ, టాక్సీ నంబర్ 9211తో పలు చిత్రాల్లో నటించింది. ఆ సమయంలోనే టాలీవుడ్ నుంచి కూడా సమీరా రెడ్డికి ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. తెలుగులో సమీరా చేసిన తొలి చిత్రం నరసింహుడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో హీరోగా నటించాడు. 2005లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చిరంజీవితో జై చిరంజీవ, ఎన్టీఆర్ తో అశోక్ అనే చిత్రాల్లో నటించింది. దురదృష్టం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు పడటం వల్ల టాలీవుడ్ లో సమీరా రెడ్డిపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
దాంతో సమీరా బాలీవుడ్‌లోనే కెరీర్ సాగించింది. అలాగే తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాళీ చిత్రాల్లో కూడా అడపా తడపా సినిమాలు చేసింది. 2013లో వరదనాయక అనే కన్నడ చిత్రంలో సమీరా రెడ్డి చివరి సారిగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇందుకు ప్రత్యేకించి మరో కారణం ఏమీ లేదు. సమీరా రెడ్డి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని భావించింది. 2014లో అక్షయ్ వర్దే అనే పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుంది. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగిపోయింది. పెళ్లి తర్వాత సమీరా సినిమాల్లో నటించడం అక్షయ్ వర్దేకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పాడు. దాంతో అప్పటి వరకు అంగీకరించిన చిత్రాలను చకచకా పూర్తి చేసేసి ఆ తర్వాత అక్షయ్ వర్దేతో ఏడడుగులు వేసింది. భర్త కోరిక మేరకు వివాహం అనంతరం వెండితెరకు పూర్తిగా దూరమైంది. సమీరా, అక్షయ్ దంపతులకు నైరా అనే కూతురుతో పాటు హన్స్ అనే కుమారుడు జన్మించాడు.
ప్రస్తుతం సమీరా రెడ్డి భర్త, పిల్లలతో ముంబైలో ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే గతంలో ఎన్టీఆర్‌ను సమీరా రెడ్డి పెళ్లి చేసుకోవాలనుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నరసింహుడు, అశోక్ సినిమాల ద్వారా ఎన్టీఆర్, సమీరా మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించలేదు. కానీ, సమీరా రెడ్డి మాత్రం గతంలో రియాక్ట్ అయింది. ఎన్టీఆర్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే అని స్పష్టం చేసింది. అతను గొప్ప నటుడని.. తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.