తాప్సీ పన్ను.. ఈ అందాల భామ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ సినీ ప్రియులకు కూడా తాప్సీ సుపరిచితమే. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తాప్సీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడింది. వైవిధ్యభరితమైన పాత్రలతో అక్కడ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. దాదాపు దశాబ్దం నుంచి బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. అటువంటి తాప్సీ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.1987 ఆగస్టు 1న న్యూ ఢిల్లీలో జాట్ సిక్కు కుటుంబంలో తాప్సీ పన్ను జన్మించింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ను పరిశీలిస్తే.. తాప్సీ తండ్రి దిల్మోహన్ సింగ్ పన్ను రిటైర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాగా.. తల్లి నిర్మల్జీత్ కౌర్ పన్ను గృహిణి. తాప్సీ షాగున్ అనే సోదరి ఉంది.
అశోక్ విహార్‌లోని మాతా జై కౌర్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన తాప్సీ.. గురు తేజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.సినిమా పరిశ్రమలో రావాలని తాప్సీ ఎప్పుడూ కోరుకోలేదు. కానీ, పాకిట్ మనీ కోసం కాలేజీ రోజుల నుండి ఆమె వివిధ ప్రకటనల కోసం మోడలింగ్ చేస్తుండేది. గ్రాడ్యుయేషన్ తర్వాత తాప్సీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొన్ని నెలలు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే సరదాగా ఛానల్ V యొక్క 2008 టాలెంట్ షో గెట్ గార్జియస్ పోటీలో పాల్గొంది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీలో పాల్గొంది. అనూహ్యంగా పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్ మరియు సఫీ ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ టైటిళ్లను గెలుచుకుంది.దాంతో ఉద్యోగాన్ని వదిలేసి తాప్సీ ఫుల్ టైమ్ మోడల్ గా మారింది. గ్లామర్ ప్రపంచంలోకి తన మొదటి అడుగు వేసింది. అనేక ప్రింట్ మరియు టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించింది.
రిలయన్స్ ట్రెండ్స్, యూనిస్టైల్ ఇమేజ్, కోకా-కోలా, రెడ్ FM 93.5, మోటరోలా, పాంటలూన్స్, PVR సినిమాస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఎయిర్టెల్, టాటా డొకోమో, డాబర్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వంటి బ్రాండ్లను ఆమోదించింది. కొన్నాళ్ల తర్వాత మోడలింగ్ ద్వారా సరైన గుర్తింపు రాదని భావించి సినిమాల్లో వెళ్లాలని నిర్ణయించుకుంది.హీరోయిన్ గా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుండగా.. తమిళంలో ధనుష్‌కు జోడీగా ఆడుకలమ్ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాల్లో మొదట ఝుమ్మంది నాదం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2010లో రిలీజ్ అయిన ఝుమ్మంది నాదం మంచి విజయం సాధించడమే కాకుండా తెలుగునాట తాప్సీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. అటు 2011లో రిలీజ్ అయిన ఆడుకలమ్ కూడా హిట్ అయింది.
తొలి ప్రయత్నింలోనే రెండు భాషల్లోనూ సక్సెస్ అయిన తాప్సీకి హీరోయిన్ గా ఛాన్సులు క్యూ కట్టాయి. తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సహాసం తదితర చిత్రాల్లో నటించింది. అటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. అయితే తాప్సీ నటించిన వాటిలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొన్ని సినిమాలు మంచి విజయం సాధించినా.. వాటిలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ను ప్లే చేయడం వల్ల తాప్సీకి సరైన గుర్తింపు వచ్చేది కాదు.ఈ నేపథ్యంలోనే తాప్సీ బాలీవుడ్ కు మకాం మార్చింది. ఛష్మే బద్దూర్ అనే మూవీతో 2013లో నార్త్ లో అడుగు పెట్టింది. పింక్ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో తాప్సీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను పరుగులు పెట్టింది. ఓవైపు స్టార్ హీరోలతో జతకడుతూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ కథలతో అక్కడి ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.
అలాగే తన ముక్కు సూటి తనంతో అనేక వివాదాల్లో చిక్కుకుని ఫైర్ బ్రాండ్‌గా కూడా గుర్తింపు పొందింది. గత ఏడాది డంకీ మూవీతో భారీ విజయాన్ని అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో దాదాపు నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తోంది. మరోవైపు వ్యాపార రంగంలోనూ చక్రం తిప్పుతోంది. వివాహాలు మరియు అనేక కార్యక్రమాలు నిర్వహించే ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ కంపెనీకి తాప్సీ సహ యజమానిగా వ్యవహరిస్తోంది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 36 ఏళ్లు వచ్చినా తాప్సీ ఇంకా అన్‌మ్యారీడ్ ట్యాగ్‌తోనే కొనసాగుతోంది. అలా అని తాప్సీ సింగిల్ అనుకుంటే పొరపాటే అవుతుంది. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ లో ఉంది. గత పదేళ్ల నుంచి వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించింది.
మథియాస్ బోతో తాను దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని.. బాలీవుడ్లో డెబ్యూ చేస్తున్న టైమ్‌లో అతను పరిచయం అయ్యాడని తాప్సీ తెలిపింది. ఈ పదేళ్లలో మథియాస్ బోతో చాలా సంతోషంగా ఉన్నానని, అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన ఏనాడు రాలేదని.. అంత బాగా అతను చూసుకున్నాడని తాప్సీ చెప్పుకొచ్చింది. మథియాస్ బో విషయానికి వస్తే.. 1980 జూలై 11న డెన్మార్క్ లోని ఫ్రెడెరిక్సుండ్ జన్మించాడు. మథియాస్ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. 2015 యూరోపియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ విజేత, 2012 మరియు 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు. మరియు 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు సాధించిన మథియాస్ 2020లో 39 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. మథియాస్ బో దాదాపు రూ. 50 నుంచి 60 కోట్లు విలువ చేసే ఆస్తులకు వారసుడని పలు నివేదికలు చెబుతున్నాయి.