Adipurush: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.రామాయణాన్ని పూర్తిగా మార్చేసారని చిత్ర దర్శకుడితో పాటు కొందరు మేకర్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ఈ మూవీపై నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. అయోధ్యలోని సాధువులు అయితే ఆదిపురుషుని నిషేధించాలని డిమాండ్ చేయగా, పాల్ఘర్లో సినిమా ప్రదర్శనను కూడా నిలిపివేశారు. అయితే సినిమాలోని డైలాగ్స్ వివాదాస్పదం కావడంతో ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతషిర్ కు ముంబై పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు.
ఆదిపురుష్ సినిమా లోని పలు డైలాగులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ హిందూ సేన వంటి సంస్థలు మండిపడ్డాయి. అటు సోషల్ మీడియాలో కూడా మనోజ్‌పై చాలా మండిపడుతున్నారు. ఆదిపురుష్ చిత్రం రామాయణాన్ని, రాముడిని కించపరచేదిగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు మనోజ్ ముంతాషీర్‌కు భద్రత కల్పించారు. తనకు ప్రాణహాని ఉందని తెలియజేడంతో పోలీసులు పలు చర్చల తర్వాత ఆయనకు భద్రత కల్పించారు.
అంతేకాక ముంబై పోలీసులు కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో రాసిన డైలాగులపై బీజేపీ నేత, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. ఎవరి మనోభావాలని కించపరిచే హక్కు ఎవరికి లేదు అన్నారు. ప్రస్తుతం నేపాల్‌లో సినిమాపై నిషేధం విధించడం జరిగింది. అలానే పలు సినిమా థియేటర్లలో సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మూవీకి సంబంధించి పలు డైలాగ్స్ కూడా మార్పు చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆదిపురుష్ సినిమా మంచి టాక్‌తో కాకపోయిన వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంది.ఆదిపురుష్ చిత్రంలో అయిదు డైలాగుల పట్ల అనేకమంది తనను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారని మనోజ్ ఇటీవల చెప్పుకొచ్చారు. తను ఇందులోని డైలాగ్స్ ని ఈ కాలపు యువతకు తగినట్టు వీటిని రాశానని, కొంత డిఫరెంట్ గా ఉండాలన్నట్టు వారి ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగిందని తెలియజేశాడు. అయితే తాను సనాతన ధర్మాన్ని విస్మరించలేదని పేర్కొన్నాడు. పెద్దల సలహాల మేరకు ఆదిపురుష్ మేకర్స్ కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు.