Pawan: జనసేనా పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకవైపు వారాహి యాత్ర, మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు. ఇవన్నీ చూస్తుంటే ఈ సారి ఎలాగైన ఏపీలో పట్టు సాధించాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీ నాయకులు చేసే అరాచకాలని ఎండగడుతూ వారిపై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ . అయితే పవన్ కళ్యాన్ తాజాగా ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో సంచలనం సృష్టించగా, 18 స్థానాల్ని గెల్చుకున్న తర్వాత కొద్దికాలానికి కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఈ విలీన ప్రక్రియపై ఇప్పటికీ అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా వాటిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పి గన్నవరం నియోజవకర్గంలో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్… ప్రజారాజ్యం పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన నాయకులకి అప్పుడు కమిట్మెంట్ లేకపోవడం వల్లనే విలీనం చేయాల్సి వచ్చిందన్నట్టు మాట్లాడారు. జనసేన నాయకులకు ఉన్న కమిట్మెంట్ అప్పుడు ఉండి ఉంటే..పార్టీని విలీనం చేయాల్సి వచ్చేది కాదని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. మరి ఈ కమిట్మెంట్ చిరంజీవిలో లేదా, లేదా ప్రజారాజ్యం స్థానిక నేతలకా అన్నదాని గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఎవరైతే ఎన్నికలలో గెలుస్తారో వారికి కమిట్మెంట్ ఉండాలని పవన్ అన్నారు.
2014 సంవత్సరంలో తాను చీకట్లో బయలుదేరితే..2019లో రాజోలు రూపంలో చిరుదీపం అందిందన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటే ఉన్న ఒక్క నాయకుడు వెళ్లిపోయాడని చెప్పారు పవన్. ఇప్పుడు తాను గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి, సమయం పెడతానని చెప్పారు.. 2019 సమయంలో జరిగిన ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో తనకు 18 శాతం ఓట్లు పడ్డాయని అంటే 20 లక్షలమంది ఓట్లేశారని పవన్ గుర్తు చేసుకున్నారు. రాజోలులో జరిగిన రోడ్ షోలో తనపై రాళ్లు పట్టుకుని దాడి చేయడానికి నలుగురు యువకులు ప్రయత్నించారని , వారిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతాయో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.