Icon Star: మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చాడు. గంగోత్రి సినిమాతో తొలిసారి హీరోగా పలకరించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ని చూసిన ప్రతి ఒక్కరు ఎన్నో విమర్శలు చేశారు. ఆయన తండ్రి ప్రొడ్యూసర్ కాకపోయుంటే, మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ లేకపోతే హీరో ఎలా అయ్యేవాడు. కనీసం సైడ్ యాక్టర్‌గా కూడా పనికి రాడు అంటూ తిట్టిపోసారు. ఆ సమయంలో బన్నీ ఎన్నో విమర్శలు, మరెన్నో ఒడుదొడుకులు దాటుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారి 69 ఏళ్ల చరిత్రలో ఏ తెలుగు హీరో సాధించలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించి తెలుగోడు కాలర్ ఎత్తుకునేలా చేశాడు.
అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్‌గా పరిచయమై.. ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని పిలిచేలా బన్నీ తన స్థాయిని పెంచుకున్నాడు. ఆర్య సినిమాతో బన్నీకి సుకుమార్ లైఫ్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ.. ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలిగించాడు. ఇక అప్పటి నుంచి మొదలు.. తన కష్టాన్ని, కథను, డైరెక్టర్ల కాన్ఫిడెన్స్ నమ్ముకుంటూ ముందుకు సాగాడు. దేశముదురు కోసం సిక్స్ ప్యాక్‌లో కనిపించాడు. పరుగు, ఆర్య-2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి.. ఇలా వరుసగా ఏడాదికో సినిమా చేసుకుంటూ ప్రతి సినిమాలో తన కొత్తదనం చూపిస్తూ మెల్లమెల్లగా జనాలకి చాలా దగ్గరయ్యారు. అతనికంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నారు.
బన్నీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అయితే ఏ రోజు కూడా హేటర్స్‌పై ఆయన పెద్దగా రియాక్ట్ కాలేదు. తన అభిమానులే తన ఆర్మీ అంటూ.. తన వ్యక్తిత్వంతోనే ఎంతో మంది మెప్పు కూడా పొందారు. తనను అభిమానించే వాళ్లను ఎప్పుడూ తలదించుకోనివ్వనని చెప్పిన బన్నీ.. 2016లో సరైనోడు సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం,నా పేరు సూర్యా.. నా ఇల్లు ఇండియా,అలా వైకుంఠపురంలో.. ఇలా ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ తన యాక్టింగ్ మెచ్యూరిటీని చూపిస్తూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక పుష్ప సినిమా కోసం రగడ్ లుక్‌తో, మాసిన బట్టలతో ఓ స్మగ్లర్ అవతారమెత్తి.. తనలోని నటున్ని సరికొత్తగా ఆవిష్కరించి జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఈ రోజు తనని హేట్ చేసిన వాళ్లు కూడా బన్నీకి ఆ అవార్డ్ రావడం సరియైనదే అంటూ ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.