Mahesh Rajamouli: ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలకి పాకేలా చేస్తున్నాడు. బాహుబలి సిరీస్‌తో ప్రభంజనం సృష్టించిన జక్కన్న చివరిగా ఆర్ఆర్ఆర్ తో చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఏకంగా ఆస్కార్ కూడా వరించింది. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబు సినిమాపై పని చేస్తున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వేంచర్‌గా ఈ చిత్రాన్ని జక్కన్న రూపొందించనున్నారట. అయితే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెప్పిన విజయేంద్ర ప్రసాద్..జూలై చివరి కల్లా ఇది పూర్తిచేసి రాజమౌళి చేతిలో పెడతామని చెప్పుకొచ్చారు. అనంతరం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతామని వివరించారు. చిత్రంలో మహేష్ బాబు అతిధి సినిమా తరహా లాంగ్ హెయిర్ లో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి ఎండ్ అనేది ఉండదని, సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఆనందం తన్నుకొచ్చింది. చిత్రం ప్రముఖ హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ అయిన `ఇండియానా జోన్స్` సిరీస్ తరహాలో ఉంటుందని, `రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్(1981) తరహాలో అనేక భావోద్వేగాలతో కూడిన అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది మహేష్- రాజమౌళి కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆగస్టు 9న చిత్ర ప్రారంభోత్సవ వేడుక చేస్తారని అంటున్నారు. ఎప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకి హాజరు కాని మహేష్ బాబు.. ఈ మూవీ కోసం మాత్రం వస్తాడని టాక్. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాక ప్రి ప్రొడక్షన్ పనులని ఆరు నెలలో పూర్తి చేసి వెంటనే షూటింగ్ మొదలు పెట్టి త్వరగతిన చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్టు టాక్.