Anushka: సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. కేవలం హీరోయిన్గా కాకుండా నటనా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలలోను నటించి అదరగొట్టింది. బాహుబలి సినిమాలో దేవసేన అనే పాత్రలో నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది అనుష్క. ఈ సినిమాతో అనుష్కకి నేషనల్ స్టార్డమ్ కూడా దక్కింది. అయితే బాహుబలి తర్వాత అనుష్క సినిమాల స్పీడ్ తగ్గించింది. మూడేళ్ల క్రితం అనుష్క నిశ్శబ్ధం అనే చిత్రం చేయగా, ఇప్పుడు ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది.. మూడేళ్ల తర్వాత అనుష్క కమ్‌బ్యాక్ చిత్రం కావడంతో ఈమూవీపై ఫ్యాన్స్ చాలానే అంచనాలు పెట్టుకున్నారు.
నవీన్ పాలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4వ తేదీన విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాని నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది.అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అయితే ఇదే అనుష్కకి చివరి సినిమా అని, ఈ మూవీ తర్వాత అనుష్క ఇక సినిమాలు చేయదని తాజాగా కొత్త ప్రచారం ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. అనుష్కకి ప్రస్తుతం అవకాశాలు కూడా ఏమి రావడం లేదు. అలాంటి సమయంలో వాటి కోసం పాకులాట ఎందుకని సినిమాలకి గుడ్ బై చెప్పాలని అనుకుంటుందట.
మరి సినిమాలు మానేసి అనుష్క పెళ్లి పీటలెక్కుతుందేమోనని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికే అనుష్క..ప్రభాస్‌ల ప్రేమాయణం గురించి ఎన్ని వార్తలు వచ్చాయో మనం చూశాం. వాటిని వీరిద్దరు ఖండించారు. ఆ తర్వాత పలువురు వ్యాపారవేత్తలతో అనుష్క పెళ్లి అంటూ ప్రచారాలు సాగాయి. అవి కూడా పుకార్లుగానే మిగిలాయి. మరి ఈ అమ్మడు నిజంగానే సినిమాలు మానేస్తుందా, ఒకవేళ మానేస్తే పెళ్లి చేసుకుంటుందా అనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా, అనుష్క జీవితాన్ని తలకిందులు చేసిన చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రం కోసం అనుష్క బాగా వెయిట్ పెరిగింది. ఆ బరువు తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తగ్గలేకపోయింది. దాంతో కెరీర్ డీలా పడింది.