నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్ ఉంది. పరుచూరి సోదరులు రాసిన ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఆ సినిమా వచ్చి 21 ఏళ్లు అయినా ఆ డైలాగ్ ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంది. అయితే ఒరిజనల్‌గా ఈ డైలాగ్ పరుచూరి సోదరులది కాదు.. మహానటుడు ఎన్టీఆర్‌ది.
అదేలాగంటే..
రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం ‘నాదేశం’. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె. దేవీవరప్రసాద్ , ఎస్.వెంకటరత్నం నిర్మాతలు. హిందీలో అమితాబ్ నటించిన ‘లావరిస్’ సినిమాకు ఇది రీమేక్. అసలు విషయానికి వస్తే.. ‘నాదేశం’లో ముగింపు సన్నివేశంలో మాత్రమే ఒకే ఒక ఫైట్ ఉంది. మాస్ ఇమేజ్ కలిగిన ఎన్టీఆర్‌కు కేవలం ఒకే ఒక ఫైట్ కాకుండా మరో ఫైట్ ఉంటే బాగుంటుందని నిర్మాతల అభిప్రాయం.
అయితే ఆ విషయం డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌కు చెప్పే ధైర్యం లేక ఆ బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణ కు అప్పగించారు. ఒక రోజు ఎన్టీఆర్‌ను ఇంటి దగ్గర పికప్ చేసుకొని కారులో షూటింగ్‌కు బయలుదేరారు. ముందు సీటులో దేవీవరప్రసాద్, ఎన్టీఆర్ మేకప్‌మాన్, వెనుక సీటులో ఎన్టీఆర్, పరుచూరి గోపాలకృష్ణ కూర్చున్నారు. మాటల మధ్యలో సినిమాలో మరో ఫైట్ ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావించారు గోపాలకృష్ణ. ఎన్టీఆర్‌కు మూడ్ బాగుండటంతో ‘ఏ సీనులో ఆ ఫైట్ పెడతారు?’ అని ప్రసన్నంగా అడిగారు.
పరుచూరి గోపాలకృష్ణ ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పి.. ‘ఈ సందర్భంలో వారితో మీకు ఫైట్ పెడితే బాగుంటుందండి’ అని చెప్పారు. ‘అసలు బాగుండదు’ అని చెప్పి ఆ విషయం అంతటితో ముగించారు ఎన్టీఆర్. అది గ్రహించి టాపిక్ మళ్లించారు గోపాలకృష్ణ. అయితే ముందు సీటులో ఉన్న దేవీవరప్రసాద్ మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు.
‘మళ్లీ అడుగు’ అన్నట్లు గోపాలకృష్ణకు సైగ చేశారు. దాంతో ధైర్యం చేసి ‘అది కాదు అన్నగారూ.. మీరు నాలుగు దెబ్బలేసినా మాలాంటి అభిమానులకు ఆనందంగా ఉంటుంది కదా’ అన్నారు. దేవీవరప్రసాద్ ఈ విషయం అడిగిస్తున్నారన్న విషయం ఎన్టీఆర్‌కు అర్థమైంది. అందుకే వివరణ ఇస్తూ ‘దేనికైనా ఓ స్థాయి ఉంటుంది. సత్యనారాయణతో ఫైట్ ఉంటే చెప్పండి.. చేస్తాం. అంతేకానీ మీరు చెప్పిన వారితో ఫైట్ చెయ్యమంటారా.. ‘మేం గట్టిగా కన్నెర్ర చేస్తే గుండాగి చస్తారు వారు’ అన్నారు. ఈ సంఘటన 1982లో జరిగింది. ఇరవై ఏళ్ల అనంతరం వచ్చిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో యధాలాపంగా ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్ రాశారు గోపాలకృష్ణ. రాసిన తర్వాత కానీ అది ఎన్టీఆర్ ఆ నాడు తనతో అన్న డైలాగ్ అని ఆయనకు గుర్తు రాలేదు.