తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాలకు కొత్త ట్రెండ్ సెట్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ పాఠాలను నేర్పించిన సినిమాలలో ముందుండే మూవీ బాలయ్య సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతికి రిలీజై భారీ పోటీని తట్టుకొని.. కొన్ని థియేటర్లో ప్రింట్లు ఆలస్యంగా వచ్చిన అవాంతరాలు తట్టుకొని పండగ విజేతగా నిలవడం మర్చిపోలేని చరిత్ర. ఎన్నో థియేటర్లకు ఈ సినిమాకి వచ్చిన లాభాలతో రీ మోడలింగ్ చేసుకోవడం సౌండ్ సిస్టం ఆధునికరించుకోవడం లాంటివి చేశారని ఆ రోజుల్లో న్యూస్ పేపర్ లో వచ్చిన కథనాలకు లెక్కలేదు. 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడటం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.
అయితే ఇప్పుడు ఈ ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. మార్చి 2న ప్రపంచవ్యాప్తంగా మరోసారి 4k ప్రింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సమరసింహారెడ్డి. అయితే నేటితరం యువతకి ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ గురించి అవగాహన ఉండకపోవచ్చు.. సమరసింహారెడ్డి గా బాలయ్య విశ్వరూపం. ఫస్ట్ ఆఫ్ లో అబ్బులుగా కామెడీ ప్లేస్ ఎమోషన్ పండించిన విధానం, సిమ్రాన్, అంజలా ఝవేరిల గ్లామర్, మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఇదో కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. ఈ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే సీమ ఫ్యాక్షన్ ఆధారంగా చేసుకుని ఆ తర్వాత 100కు పైగా సినిమాలు టాలీవుడ్ లో వచ్చాయి.
ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత నెమ్మదించిన రీ రిలీజ్ ట్రెండ్ కు కెమెరామెన్ గంగతో రాంబాబు తిరిగి ఊపు ఇస్తే ఇకపై మళ్లీ ఒక్కొక్కటి క్యూ కడుతున్నాయి. రవితేజ కిక్ ని కూడా మార్చ్ 2 ప్లాన్ చేస్తున్నారు. 2022లో మొదలైన ఈ రీరిలీజ్ ట్రెండ్ గత ఎడాది ఫిక్స్ కు చేరుకుంది. మహేష్ పోకిరి, ఒక్కడు, పవన్ ఖుషి, చరణ్ ఆరెంజ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు బాలయ్య సమరసింహారెడ్డికి కూడా అదే స్పందన ఆశించవచ్చు. గతంలో నరసింహనాయుడు రీరిలీజ్ చేశారు కానీ పబ్లిసిటీ లోపం వల్ల పెద్దగా రీచ్ కాలేదు. అందుకే ఇప్పుడు ఈసారి ముందు జాగ్రత్తగా నెల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇక మరి బాలయ్య సమరసింహారెడ్డి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.