Rakesh Master: ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఊహించని మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటి వరకు మంచిగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడి ఆకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (53) కన్ను మూశారు. వైజాగ్‌లో షూటింగ్ ముగించుకుని వారం క్రితం హైదరాబాద్‌కు వచ్చిన మాస్టర్. అప్పటి నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆదివారం ఉదయం రాకేష్ మాస్టర్ రక్త విరోచనాలు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు రాకేష్ మాస్టర్ ప్రాణాలు కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. వైజాగ్‌కు వెళ్లిన రాకేష్ మాస్టర్‌కు సన్ స్ట్రోక్ రావడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రాకేష్ మాస్టర్ మృతితో ఆయన ఫ్యాన్స్‌తో పాటు పలువురి సినీ ఇండస్ట్రీ పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మాస్టర్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. రాకేష్ మాస్టర్ ఆట డ్యాన్స్ షోతో తన కెరీర్ స్టార్ట్ చేయగా, అనంతరం దాదాపుగా ఓ 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
రాకేష్ మాస్టర్ వివాదాలకి కేరాఫ్ అడ్రెస్‌గా కూడా నిలిచేవారు. చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్ ను నాశనం చేశారంటూ పలువురిపై అనేక ఆరోపణలు చేసి యూట్యూబ్ లో ఫేమ్ సంపాదించారు. కొన్నాళ్లుగా సొంత యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 1968లో తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేసిన అనంతరం డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ , మరికొందరు మాస్టర్స్ రాకేష్ మాస్టర్ శిష్యులు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.