Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచే కార్యక్రమాలలో బిగ్ బాస్ కూడా ఒకటి. విదేశాలలో మొదలైన ఈ షో ఇండియాకి వచ్చి తొలిసారి హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. హిందీలో సక్సెస్ అయిన తర్వాత షోని అనేక ప్రాంతీయ భాషలలో రూపొందించారు. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ షో కూడా రూపొందించారు. ఇక ఈ షోకి మొదట్లో ఎన్టీఆర్ .. నాని .. నాగార్జున హోస్టులుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాని చివరి నాలుగు ఎపిసోడ్స్ కి మాత్రం నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. అయితే ఎందుకో ఏమో కాని మొదటి 4 సీజన్లకి మంచి ఆదరణ దక్కగా, తర్వాత మాత్రం రియాలిటీ షోపై జనంలో ఆదరణ తగ్గుతూ వచ్చింది. రేటింగ్ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది.
బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ చేసిన పనులన్నింటిని గంట ప్రసారమయ్యే ఎపిసోడ్లో చూపించేవారు. తర్వాత లైవ్ లో 24 గంటలు చూసే ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే లైవ్‌లో చూసిన చాలా మంది ఆడియన్స్ ఆ తర్వాత మెయిన్ ప్రోగ్రామ్‌ను స్కిప్ చేస్తూ వచ్చారు. దీంతో వ్యూవర్స్ షిప్ దారుణంగా పడిపోయింది. ఇక బిగ్ బాస్ లీకులు కూడా షోకి మరో మైనస్ అని చెప్పాలి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు, కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతున్నారు ? హౌస్‌లో ఎలాంటి టాస్క్‌లు ఇవ్వబోతున్నారు అనేది ముందుగానే లీక్ కావడంతో షోపై ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. అయితే వీటన్నింటి విషయంలో ఈ సారి పలు జాగ్రత్తలు తీసుకుంటూ షోని ఆసక్తికరంగా మలచాలని మేకర్స్ అనుకుంటున్నారట.
ఈ సారి బిగ్ బాస్ 7లో చాలా మార్పులు జరగబోతున్నాయని తెలుస్తుంది. హోస్ట్‌గా నాగార్జున బదులు బాలకృష్ణ వస్తారని వినికిడి. అలానే కంటెస్టెంట్స్ గా పలువురు వివాదాస్పదమైన వ్యక్తులను తీసుకురావడం .. విడాకులు తీసుకున్న మోస్ట్ పాపులర్ జంటను ఎంపిక చేయడం .. టాస్కులు ఉత్కంఠ భరితంగా ఉండేలా చూడటం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారని టాక్. సీజన్ 1, 2,3 లలో బిగ్ బాస్ షో వీకెండ్ రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయ్యేది. అదే వీక్ డేస్‌లో మాత్రం 9.30కి స్టార్ట్ అయ్యేది. 4 సీజన్ నుంచి మాత్రం రాత్రి 10 గంటలకు పెట్టడం పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. మరి టైమింగ్ విషయంలో ఏమైన మార్పులు చేస్తారా అన్నది చూడాలి.