Indian Idol 2 Winner: ఇటీవల పాటల కార్యక్రమాలు ఫుల్ ఫేమస్ అవుతున్నాయి. ఈ కార్యక్రమల ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న సింగర్స్ వెలుగులోకి రావడం విశేషం. బాలసుబ్రహ్మణ్యం కొన్ని సంవత్సరాలుగా పాడుతా తీయగా అనే కార్యక్రమంకి హోస్ట్‌గా ఉంటూ ఈ షో ద్వారా మట్టిలో మాణిక్యాలని వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటూ సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ షోకు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. తొలి సీజన్ కు భారీ విజయం దక్కడంతో సెకండ్ సీజన్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. మార్చిలో స్టార్ట్ అయిన ఈ సెకండ్ సీజన్ ఆదివారం ముగిసింది.
ఫినాలేకి 5 గురు కంటెస్టెంట్స్ చేరుకోగా,వీరిలో ఎవరు ట్రోఫీ అందుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక తెలుగు ఇండియన్ ఐడల్ 2 సీజన్ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ఫినాలేపై అందరి దృష్టి పడింది. బన్నీ రాకతో ఫినాలే కార్యక్రమం చాలా సందడిగా సాగగా, అల్లు అర్జున్ ఈ సీజన్ 2 విజేతను ప్రకటించారు. పోటా పోటీగా జరిగిన ఫైనల్లో విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల ట్రోఫీ అందుకుంది. టైటిల్ తోపాటు.. పది లక్షల నగదు బహుమతిని ఆమెకు బన్నీ అందించారు. ఇక తొలి రన్నరప్ గా జయరాజ్ నిలిచారు. ఆయన రూ. 3 లక్షల రూపాయలు సొంతం చేసుకున్నాడు. అలాగే సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్యకు 2 లక్షల చెక్‌ను అందించారు అల్లు అర్జున్.
రెండో సీజన్‌కి పదివేల మంది ఆడిషన్స్ లో పాల్గొనగా, అందులో 12 మంది మాత్రమే టైటిల్ కోసం పోటీ పడ్డారు. చివరగా ఐదుగురు గ్రాండ్ ఫినాలేకి చేరకోగా వారిలో న్యూజెర్సీకి నుంచి శృతి, హైదరాబాద్ నుంచి జయరాం, సిద్ధి పేట నుంచి లాస్య ప్రియ, హైదరాబాద్ నుంచి కార్తీక్, వైజాగ్ నుంచి సౌజన్య భాగవతుల ఉన్నారు. ఉత్కంఠభరిత పాటల పోటీ ఫినాలే కార్యక్రమంలో చివరగా సౌజన్యని విజేతగా ప్రకటించారు. తెలుగు ఇండియన్ ఐడల్ 2 షోకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, సింగర్స్ కార్తిక్, గీతా మాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. హేమచంద్ర దీనికి హోస్ట్ గా ఉన్నారు. త్వరలో సీజన్ 3కి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది