Chiru: చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లాక చిరంజీవి వాటి గురించి పెద్దగా నోరు ఎత్తిన సందర్భాలు లేవు. తన తమ్ముడిని ఎవరు ఎన్ని మాటలు అన్నా, తమ ఫ్యామిలీపై నీచమైన కామెంట్స్ చేసిన కూడా చిరు నోరు మెదపలేదు. కాని మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 200 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో సక్సెస్ మీట్ కార్యక్రమంలో సుతిమెత్తగా ఏపీ ప్రభుత్వం మీద కౌంటర్లు వేశాడు చిరంజీవి. ఎప్పుడు చిత్ర పరిశ్రమ గురించి కాదని, మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ,లేదంటే రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయం గురించి గానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి చురకలంటించారు చిరు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఊరికే సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అని కౌంటర్లు వేశాడు.
ఎంతో సుతిమెత్తగా మాట్లాడే చిరంజీవి.. ఒక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే సరికి ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మరింత వేడి పెరిగింది. జనాల ఆకలి కేకలు, ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టకుండా సినిమా ఇండస్ట్రీ మీద మీ దృష్టి ఎందుకు అన్నట్టుగా చిరంజీవి సూచించారు. మరి చిరంజీవి ఇంత పద్దతిగా, మంచిగా చెప్పిన కూడా ఏపీ ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి ఘాటు రియాక్షన్స్ రావడం ఖాయం అని అంటున్నారు. మెగాస్టార్ ఇంత డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. వైసీపీ నాయకులు వారిపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన , ముఖ్యంగా సినిమా వాళ్ళు ఏం మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేస్తారు.
ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించిన వాల్తేరు వీరయ్య చిత్రం 200 కోట్లు సాధించి ఓటీటీలో కూడా సందడి చేసింది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ ఓ ప్రైవేట్ పార్టీలా జరిగాయి. వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు.