టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో మారుతి ఒకరు. కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేకపోయినా కూడా మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ అంటూ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గత ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ మరియు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు.ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నిజానికి వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ మారుతితో సినిమా అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఏ మాత్రం ఒప్పుకోలేదు. నానా రచ్చ చేశారు. కానీ, రీసెంట్ గా విడుదలైన రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మారుతిపై డార్లింగ్ ఫ్యాన్స్‌కి మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. మారుతి ఈసారి పక్కాగా తన మార్క్ చూపిస్తాడని భావిస్తున్నారు. రాజా సాబ్ గురించి పక్కన పెడితే.. డైరెక్టర్ మారుతి గురించి అనేక ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
దాసరి మారుతి 1981 అక్టోబర్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించారు. మారుతి తండ్రి దాసరి వన కుచలరావు బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవారు. తల్లి టైలరింగ్ చేసేవారు. వీరిది చాలా పేద కుటుంబం. మారుతి విద్యాభ్యాసం మొతం మచిలీపట్నంలోనే జరిగింది. ఇంటర్ తర్వాత బందర్ రోడ్డులో ఉన్న ఓ నెంబర్ ప్లేట్ షాపులో పనికి చేరాడు. అక్కడ వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేస్తూనే.. మరోవైపు డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో మారుతి 1998లో హైదరాబాద్‌కు వచ్చేశాడు. నిజాంపేటలోని తన అక్క ఇంట్లో ఉంటూ.. జూబ్లీహిల్స్ లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్టీయూ బస్టాప్ చేరుకునేవాడు. అక్కడ సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్స్టిట్యూట్కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా మారుతికి జర్నీ చేయడానికే ఎక్కువ టైం పట్టేది.
అయితే జర్నీ సమయంలో మారుతి ఖాళీగా ఉండేవారు కాదు. బొమ్మలు వేయడం అంటే అతనకు చాలా ఇష్టం. అందుకే బస్సుల్లో, బస్ స్టాపుల్లో హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించారు. మరోవైపు నానా తంటాలు పడి యానిమేషన్ కోర్సు పూర్తి చేసిన మారుతి.. DQ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్‌లో యానిమేషన్ ట్రైనర్ గా మారాడు. అక్కడ పని చేస్తున్న సమయంలోనే యానిమేషన్ నేర్చుకునేందుకు మారుతి వద్దకు అల్లు అర్జున్ వచ్చేవాడు. అప్పటికి ఇంకా అల్లు అర్జున్ హీరో అవ్వలేదు. యానిమేషన్ నేర్పించే క్రమంలో మారుతి, అల్లు అర్జున్ మధ్య సన్నిహిత్యం పెరిగింది. ఆ సన్నిహిత్యంతోనే మారుతికి బన్ని వాసును పరిచయం చేశాడు అల్లు అర్జున్. బన్నీ వాసు తో పరిచయం మారుతి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. బన్నీ వాసుతో మంచి స్నేహం ఏర్పడటంతో ఆయన మారుతికి ఓ సెంటర్ లో ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం ఇచ్చారు. ఆర్య భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో.. ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తేతో సహా పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా చేసే అవకాశాలు మారుతికి వచ్చాయి.
అదే సమయంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి లోగో డిజైన్ చేశాడు. అలాగే యాడ్స్ చేస్తూ ఇండస్ట్రీలో మరింత నిలదొక్కుకున్నాడు. మారుతి పనితనం గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ కోసం జెండాను డిజైన్ చేయమని మరియు పార్టీ కోసం ఇతర ప్రచార ప్రకటనలను కూడా రూపొందించమని అడిగారు. దాంతో ఆ పార్టీ లోగో, ప్రచార ప్రకటల కోసం మారుతి పని చేశాడు. అయితే యాడ్స్ చేసే క్రమంలోనే ఫిల్మ్ మేకింగ్ పై మారుతికి ఆసక్తి కలిగింది. డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. బస్ స్టాప్ స్టోరీ రాసుకుని.. నిర్మాతల కోసం తిరగడం ప్రారంభించాడు. చాలా నెలలకు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఉండేందుకు అంగీకరించారు. కాస్టింగ్ ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఈ సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలని భావించి ఓ కథను రాసుకున్నాడు.
తన స్నేహితులనే నిర్మాతలుగా మార్చి గుడ్ సినిమా గ్రూప్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశాడు. అదే బ్యానర్ లో మారుతి ఈ రోజుల్లో అనే టైటిల్ తో తన తొలి సినిమాను తెరకెక్కించారు. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ రోజుల్లో చిత్రం.. 2012లో విడుదలై రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఆగిపోయిన బస్ స్టాప్ ను బెల్లంకొండ సురేష్ మళ్లీ పట్టాలెక్కించారు. 2012లోనే బస్ స్టాప్ విడుదలై మంచి విజయం సాధించింది.ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో మారుతి పేరు మారుమోగిపోయింది. 2013లో మారుతి తన కెమెరా మాన్ జె.ప్రభాకర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మారుతీ టాకీస్ పతాకంపై ప్రేమ కథా చిత్రమ్ని రచించి నిర్మించారు. ప్రేమ కథా చిత్రమ్ 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మారుతి పలు చిత్రాలకు దర్శకుడిగా, కొన్ని చిత్రాలకు నిర్మాతగా, మరికొన్ని చిత్రాలకు రచయితగా పని చేశారు.
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలతో డైరెక్టర్ గా మారుతి టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచెలంచలుగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అరటిపళ్లు అమ్ముకునే వ్యక్తి కొడుకు నుంచి స్వయంకృషితో డైరెక్టర్‌గా ఎదిగారు. అయితే కొంత కాలం నుంచి మారుతి ఖాతాలో సరైన హిట్ పడలేదు. మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ చిత్రాలతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్న మారుతి.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రాజా సాబ్ కోసం వర్క్ చేస్తున్నారు. 2024లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. యానిమేషన్ ట్రైనర్ గా ఉన్న సమయంలోనే మారుతికి వివాహం జరిగింది. అతని భార్య పేరు స్పందన. వీరిది ప్రేమ వివాహం. స్కూల్ డేస్ నుంచి స్పందన, మారుతి ప్రేమించుకున్నారు. మారుతి తన కాళ్ల మీద తాను నిలబడిన తర్వాత స్పందన పేరెంట్స్‌ను ఒప్పించి 2003లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ దంపతలుకు ఒక కూతురుతో పాటు కొడుకు ఉన్నాడు.