Clapping: సినిమా అనేది రంగుల ప్రపంచం కాగా, ఈ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ప్రతి సినిమా షూటింగ్లో సన్నివేశం చిత్రీకరించే ముందు తప్పక క్లాప్ కొడతారు. అలా ఎందుకు కొడతారు అనేది చాలా మందికి తెలియదు. క్లాప్‌బోర్డ్ మనం గమనిస్తే దానిపై సినిమా పేరు, నిర్మాణ సంస్థ, దర్శకుడి పేరు, కెమెరామెన్ పేరు రాసి ఉంటాయి. వాటితో పాటు సీన్ నంబర్, షాట్ ఇన్ఫర్మేషన్, ఎన్ని టేక్స్ వంటి ముఖ్యమైన సమాచారం రాసి ఉంటుంది. ఎన్ని టేక్స్ తీసుకుంటే ఆ టేక్ నంబర్ కూడా రాస్తూ ఉంటారు. అయితే పక్కా సమాచారంతో షూటింగ్ చేసిన వీడియోలన్నింటిని కూడా ఎడిటర్ దగ్గరకు పంపిస్తారు.
ఆ క్లాప్బోర్డ్లోని సీన్ నంబర్ల ఆధారంగా వీడియోలని ఎడిటర్స్ సెట్ చేసుకుంటారు.. అయితే అన్ని టేక్స్ లో దర్శకుడు ఏ టేక్ ఓకే చేసాడనేది లాగ్ షీట్ చూసిన తర్వాత అతనికి అర్ధమవుతుంది.ఇక క్లాప్ బోర్డ్ ఎందుకు కొడతారు అనే అనుమానం కూడా అందరిలో ఉంటుంది. క్లాప్ కొట్టినప్పుడు సౌండ్ కూడా వస్తుంది. దానికి కారణం లేకపోలేదు. సెట్లో సౌండ్ మరియు విజువల్స్ విడివిడిగా రికార్డ్ చేస్తారు. షూటింగ్ సమయంలో దర్శకుడు .. లైట్లు, కెమెరా, సౌండ్, యాక్షన్ అంటారు. ఆ సమయంలో కెమెరా, సౌండ్ కలిసి రికార్డ్ చేయడం ప్రారంభించవు. అలాగే విజువల్, సౌండ్ విడివిడిగా రికార్డ్ చేయబడడం వలన, వాటిని కంప్యూటర్లో కలపడం లేదా స్క్రీన్ చేయడం సులభమైన పని కాదు.
ఆ రెండింటిని సరైన పద్దతిలో సెట్ చేయని పక్షంలో ముందుగా విజువల్.. ఆ తర్వాత సౌండ్ వస్తుంది. లేకుంటే ముందు సౌండ్ వచ్చి ఆ తర్వాత సన్నివేశం ఆలస్యంగా ప్లే అవుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు క్లాప్ బోర్డ్ కొడతారు. సౌండ్ తరంగాల రూపం రికార్డ్ అవుతుందని అందరికి తెలిసిన విషయమే. కంప్యూటర్లో కూడా, ఎడిటర్‌కు ధ్వని, తరంగాలు కనిపిస్తాయి. అసిస్టెంట్ డైరెక్టర్లు క్లాప్ బోర్డ్ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ స్పైక్ వేవ్‌ను అది సృష్టించడంతో ఎడిటర్ ఆడియో, విజువల్స్‌ని గుర్తించి సులభంగా వాటిని సింక్ చేయగల్గుతారు. ఇంక కొన్నిసార్లు ఒకే సన్నివేశానికి రెండు లేదా మూడు కెమెరాలు, సౌండ్ రికార్డర్ పరికరాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి సమయంలో కూడా క్లాప్ సౌండ్ చాలా ఉపయోగపడుతుంది. క్లాప్ శబ్దం లేకుండా, ఎడిటింగ్ చాలా కష్టం కాబట్టే షూటింగ్ సమయంలో క్లాప్ బోర్డ్ తప్పక ఉపయోగిస్తారు.