Sankranti: సంక్రాంతికి దర్శక నిర్మాతలు తమ సినిమాలని విడుదల చేసి మంచి లాభాలు ఆర్జించాలని భావిస్తుంటారు. ప్రతి సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవుతుండగా, అవి మంచి ఆదరణ కూడా నోచుకుంటాయి. గత సంక్రాంతికి చిరు, బాలయ్య తెగ సందడి చేయగా, ఈ సారి ఐదు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ దక్కడం ఖాయం. కాకపోతే థియేటర్స్ పంచాయితీ షురూ మాత్రం ఖాయం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ మూతబడ్డాయి. ఉన్న కొద్ది థియేటర్స్ పై కూడా గుత్తాధిపత్యం ఎక్కువగా ఉంది. దిల్ రాజు సర్దుబాటు వ్యవహారంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
దిల్ రాజు 2024 సంక్రాంతికి విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సంక్రాంతి బరిలో రానున్న సినిమాలు థియేటర్స్ గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు గుంటూరు కారం , రవితేజ ఈగిల్, తేజా సజ్జా హనుమాన్, విజయ్ దేవరకొండ 13 చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక వీటితో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నా సామిరంగ అంటూ కొత్త మూవీ ప్రకటించగా, దీనిని పెద్ద పండగకు తెస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ కల్కి కూడా సంక్రాంతికి అని ముందు ప్రకటించారు కాని అది జూన్/జులై కి వాయిదా పడినట్లు తెలుస్తుంది.
ఈ ఐదు చిత్రాలకే థియేటర్స్ అడ్జెస్ట్ కాని పరిస్థితి. అదే సమయంలో ఒకటో రెండో డబ్ చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. మా సినిమాల విడుదలని అడ్డుకుంటే తెలుగు సినిమాలు తమిళనాడులో ఆడనివ్వమని లొల్లి చేయడం మనం చూశాం. దీంతో వారి సినిమాలకి థియేటర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. మరి సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ పెద్దవే. ఏ హీరో సినిమాకి తక్కువ థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ ట్రాఫిక్ సమస్య ఎలా తీరుతుందో చూడాలి.