Pawan kalyan: ప్రజా యుద్ధ నౌక గద్దర్ నింగికేగారు. అనారోగ్యం సమస్యతో ఆదివారం సాయంత్రం కన్నుమూసారు. ఆయన మృతితో సినీ, రాజకీయ నాయకులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. గద్దర్ అంత్యక్రియలు సోమవారం పూర్తి కాగా, ఆయనని కడసారి చూసేందుకు అశేష ప్రజానీకం తరలి వచ్చారు. గద్దర్ ఇక లేరనే వార్తని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన లేరని తెలిసి చాలా ఎమోషనల్ అవుతున్నారు. గద్దర్‌పై తనకి ఉన్న ప్రేమని, అభిమానాన్ని, అనుబంధాన్ని చాటుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక వీడియో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. తన ఇన్‌స్టాలో రెండో పోస్ట్ గా గద్దర్ గురించి పోస్ట్ పె్టిన పవన్… `నా అన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్` అంటూ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో గద్దర్ గురించి తన వాయిస్ ఓవర్‌తో గొప్పగా చెప్పుకొచ్చారు.
`భీటలు వారిన ఎండలో సమ్మెట కొట్టే కూలికి గొడుగు గద్దర్, తాండాల బండల్లో చలిపులిని బెదిరించే నెగటు గద్దర్, పీడిత జనాల పాట గద్దర్, అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్, అడవిలో ఆకు చెప్పి కథ గద్దర్. కోయిల పాడిన కావ్యం గద్దర్, గుండెకు గొంత్తొస్తే, బాధకి భాషొస్తే అది గద్దర్, అన్నింటిని మించి నా అన్న గద్దర్. అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి, అన్యాయంపై తిరగబడ్డ పాటవి, ఇది వరకు నువ్వు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి, తీరం చేరిన ప్రజా యుద్ధనౌకకి జోహార్.. జోహార్.. జోహార్` అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు గద్దర్‌తో దిగిన ఫోటోలను కూడా ఇందులో పంచుకున్నారు.
అయితే గద్దర్ ని కడసారి చూడడానికి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి పరామర్శించారు. వీరిద్దరి మధ్య ఇంత అనుబంధం ఎలా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే పవన్ కల్యాణ్ అంటే గద్దర్ కు ఎంతో ప్రేమ అని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, ప్రేమగల్ల తమ్ముడు అంటూ పదే పదే చెప్పిన గద్దర్… తనకు అవసరమైతే ఆయన జేబులో చెయ్యి పెట్టి ఎన్ని డబ్బులుంటే అన్ని తీసేసుకునేంత చనువు కూడా ఉందని అనేవారు. పవన్ తరచుగా నాకు లెటర్లు రాస్తూ… అన్నయ్య బాగున్నవా? చల్లగా బతుకు అని చెప్పేవాడు” అని గద్దర్ చెప్పుకొచ్చేవారు. కాగా, గద్దర్ మృతి తర్వాత పవన్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గద్దర్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయనతో పలు సందర్భాల్లో చాలా సమయం గడిపానని అన్నారు. చిన్నప్పటి నుంచి శ్రీశ్రీ తర్వాత గద్దర్ అంటేనే ఎక్కువ ఇష్టపడేవాడినని కూడా చెప్పుకొచ్చారు.