టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న నాగశౌర్య.. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటువంటి నాగశౌర్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1989 జనవరి 22న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో నాగ శౌర్య ముల్పూరి జన్మించారు. తండ్రి ముల్పూరి శంకర్ ప్రసాద్ వ్యాపారవేత్త కాగా.. తల్లి ముల్పూరి ఉషా ప్రసాద్ గృహిణిగా ఉండేవారు. అయితే ఇటీవల ఉషా గారు ఫుడ్ బిజినెస్ లోకి దిగారు. హైదరాబాద్ మాదాపూర్ లోని మెగా హిల్స్ కాలనీలో ఉషా ముల్పూరి కిచెన్ పేరుతో ఓన్‌గా రెస్టారెంట్ స్టార్ట్ చేశారు.
నాగశౌర్య విషయానికి వస్తే.. ఏలూరులో పుట్టిన ఆయన విజయవాడలో పెరిగారు. చిన్నతనం నుంచి నాగశౌర్యకు సినిమాలంటే మహా పిచ్చి. సినిమాలు, స్పోర్ట్స్ అంటూ చదువులపై అస్సలు ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. బాగా చదవడం లేదని తల్లి చేతుల్లో నాగ శౌర్య తన్నులు తిన్న సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి.అయితే ఎలాగోలో బీ.కామ్ కంప్లీట్ చేసిన నాగశౌర్య.. ఇండస్ట్రీలోకి వెళ్లాలని, యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు. తన కలను నెరవేర్చుకోవడానికి విజయవాడ నుంచి హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. సినిమాల్లో రాకముందు నాగ శౌర్య టెన్నిస్ చాలా ఆడేవాడు. ఒకవేళ యాక్టింగ్ ఫీల్డ్ లోకి రాకపోయుందే తాను టెన్నిస్ ప్లేయర్ ను అయ్యేవాడనని గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య పేర్కొన్నాడు.
ఇకపోతే సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో నాగశౌర్యకు అంత త్వరగా అవకాశాలైతే దక్కలేదు. ఛాన్సుల కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. ఎన్నో ఎదురు చూపుల తర్వాత క్రికెట్ గర్ల్స్ & బీర్ మూవీలో మెయిన్ లీడ్ పోషించే అవకాశం నాగశౌర్యకు వచ్చింది. ఎస్. ఉమేష్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2011లో విడుదలైంది. కానీ, ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫ్లాప్ తో నాగశౌర్యకు మరో అవకాశం రావడానికి మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లు నాగశౌర్య తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇండస్ట్రీని వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలని కూడా అనుకున్నాడు. అప్పుడే నాగశౌర్య వారాహి చలన చిత్రం ద్వారా ఓ ప్రకటన చూశాడు. అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ చేస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ఊహలు గుసగుసలాడే సినిమా కోసం ఆడీషన్స్ జరుగుతున్నాయని ఈ ప్రకటనలో ఉంది. వెంటనే నాగశౌర్య ఆడీషన్స్ లో పాల్గొన్నాడు.నిజానికి నాగశౌర్య తనకు ఛాన్స్ వస్తుందని నమ్మకాన్ని పెట్టుకోలేదు. కానీ, అనూహ్యంగా అవసరాల శ్రీనివాస్ అతని హీరో క్యారెక్టర్ కోసం సెలక్ట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అలా నాగశౌర్య హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా ఊహలు గుసగుసలాడే మూవీ పట్టాలెక్కింది.
ఈ చిత్రంలో పనిచేస్తున్నప్పుడే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చందమామ కథలు చిత్రంలో ఓ క్యారెక్టర్ కోసం నాగశౌర్యను ఎంపిక చేశారు. 2014లో విడుదలైన చందమామ కథలు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. అదే ఏడాది ఊహలు గుసగుసలాడే మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో నాగ శౌర్య తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. నటుడిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావే మా ఇంటికి, జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి, కల్యాణ వైభోగమే, ఒక మనసు.. ఇలా తరుస పెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. చివరిగా రంగబలి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. అయితే నాగ శౌర్య నటుడిగానే కాకుండా.. నిర్మాణ రంగంలోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఐరా క్రియేషన్స్ పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించాడు. ఈ బ్యానర్ లో వచ్చిన మొదట చిత్రం ఛలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆపై తాను నటించిన నర్తనశాల, అశ్వథామ, కృష్ణ బృందా విహారి చిత్రాలకు కూడా నాగశౌర్య సహ నిర్మాతగా వ్యవహరించారు. నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్ సైతం ఐరా క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. ఆస్తుల విషయానికి వస్తే.. నాగశౌర్య నికర విలువ రూ. 35 నుంచి 45 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఒక్కో సినిమాకు ఆయన రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కన పెడితే…. నాగశౌర్య 2022లో తన బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డు వేశాడు. తన ఫ్రెండ్ అనూష శెట్టిని బెంగళూరులో నవంబర్ 20న వివాహం చేసుకున్నాడు. అనూష బెంగళూరులో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా సత్తా చాటుతున్నారు. ఆమె అనూష డిజైన్స్ పేరుతో సొంతంగా ఒక కంపెనీని కూడా రన్ చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనర్ గా అనూష తన భర్త నాగశౌర్యకు ఏ మాత్రం తీసిపోని విధంగా సంపాదిస్తున్నారు. ఇకపోతే గతంలో నాగశౌర్యపై కొన్ని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒక మనసు తర్వాత మెగా డాటర్ నిహారిక, నాగశౌర్య లవ్ లో ఉన్నారని.. ఇద్దరి పెళ్లికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ రాశి ఖన్నాతో మూడేళ్లు నాగశౌర్య లవ్ ఎఫైర్ నడిపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, నాగశౌర్య మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాను ఏ హీరోయిన్ తో రిలేషన్ లో లేనని గతంలో ఆయన ఘాటుగా బదులిచ్చారు.