తేజ సజ్జ.. ప్రస్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుకగా తెలుగులో నాలుగు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో గుంటూరు కారం, నా సాంగరంగ, సైంధవ్ వంటి పెద్ద చిత్రాలతో పాటు తేజ సజ్జ నటించిన హనుమాన్ కూడా ఉంది. సూపర్ హీరో స్టోరీతో టెలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సౌత్ తో పాటు నార్త్ ఆడియెన్స్ ను కూడా హనుమాన్ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. ఓవర్సీస్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించడంతో.. హనుమాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో పోటీ పడి తేజ సజ్జ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. తన ఇమేజ్ ను పదిరెట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జ వెంట నిర్మాతలు పరుగులు పెడుతున్నారు. అతని డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తేజ సజ్జ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా ఏంటో చూపించిన అతి కొద్ది మంది నటుల్లో తేజ సజ్జ ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తేజ హీరోగా ఎదిగాడని అందరికీ తెలుసు. కానీ, అతనికి తొలి అవకాశం ఎలా వచ్చింది..? తేజ తల్లిదండ్రులు ఎవరు..? వంటి విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు. 1994 ఆగస్టు 23న తెలంగాణలోని హైదరాబాద్‌లో తేజ సజ్జ జన్మించాడు. అతని తండ్రి ఫార్మా కంపెనీ ఉద్యోగి కాగా.. తల్లి హౌస్ వైఫ్. తేజకు కృష్ణ కిరీటి అనే ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి వివాహం కూడా జరిగింది. చిన్న తనం నుంచి తేజ చాలా చురుగ్గా ఉండేవాడు. కేవలం రెండేళ్ల వయసులోనే చూడాలని వుంది మూవీ కోసం తేజ కెమెరాను ఫేస్ చేశాడు. అయితే తొలి అవకాశం తేజకు అనుకోకుండానే వచ్చింది. ఓ సూపర్ మార్కెట్ లో డైరెక్టర్ గుణశేఖర్ కు తేజ కనిపించాడు. తేజ చురుకుతనం గుణశేఖర్ ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే చూడాలని వుంది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజను పరిచయం చేస్తానని గుణశేఖర్ అతని తల్లిదండ్రులను సంప్రదించాడు.
అయితే తేజ ఫ్యామిలీకి ఎటువంటి సినీ నేపథ్యం లేదు. మొదట తేజను సినిమాల్లోకి పంపడానికి వాళ్లే ఏ మాత్రం అంగీకరించలేదు. కానీ, గుణశేఖర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. చిరంజీవి హీరోగా నటిస్తున్నాడని చెప్పి పట్టు బట్టి తేజ తల్లిదండ్రులను ఒప్పించారు. గుణశేఖర్ చొరవతో తేజ చూడాలని వుంది మూవీతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రం 1998లో విడుదలైంది. తొలి సినిమాతోనే తేజ తెలుగు వారికి దగ్గరయ్యాడు. తన క్యూట్ అండ్ స్వీట్ యాక్టింగ్ తో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. దాంతో అతని మరిన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు అలా రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, బాచి, సర్దుకుపోదాం రండి, దీవించండి, ప్రేమసందడి, ఆకాశ వీధిలో, ఇంద్ర, ఒట్టేసి చెపుతున్నా, గంగోత్రి, వసంతం, ఠాగూర్, సాంబ, అడవి రాముడు, బాలు.. ఇలా అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ నటించాడు.
చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. టీనేజ్ కి వచ్చే సమయానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో హీరో అవ్వాలని తేజ ఫిక్స్ అయ్యాడు. 2006 నుంచి వెండితెరకు దూరంగా ఉన్న తేజ.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. చదువుకుంటున్న సమయంలోనే వైజాగ్ లో ఉన్న సత్యానంద్ గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చినా.. హీరోగా మాత్రం అంత సులభంగా ఛాన్సులు రాలేదు. సినిమా ఆఫీసుల చుట్టూ తేజ విసృతంగా తిరిగాడు. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. సినిమా సెట్ అయినట్లే సెట్ అయ్యి ఆగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినాసరే తేజ వెనకడుగు వేయలేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తేజ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఓ! బేబీతో ప్రారంభించాడు. నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సమంత మెయిన్ లీడ్‌ను పోషిస్తే.. తేజ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాతే తన స్నేహితుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జాంబీ రెడ్డి మూవీతో తేజ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. జాంబీ కాన్సెప్ట్ తో వచ్చిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం వంటి చిత్రాలతో నటుడితో మరో రెండు మెట్లు ఎక్కిన తేజ.. తాజాగా హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. భారీ అంచనాలేమి లేకుండా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన హనుమాన్.. అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అనుకున్నదానికంటే చాలా పెద్ద విజయం సాధించింది. విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర పర్యాటక మంత్రి కిష్ రెడ్డి సైతం ఢిల్లీలోని తన నివాసంలో తేజను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. తేజ ఇమేజ్ తారా స్థాయికి చేరుకోవడంతో.. నిర్మాతలు అతని డేట్స్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. అయితే తేజ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికైతే డైరెక్టర్ నక్కిన త్రినాధరావుతో ఓ మూవీ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సంతకం చేశాడని అంటున్నారు. ఇకపోతే హనుమాన్ భారీ విషయం సాధించినప్పటికీ.. తేజ తీసుకున్న రెమ్యునరేషన్ జెస్ట్ రూ. 2 కోట్లు అని ఇన్సైడ్ టాక్. అయితే ఇకపై చేయబోయే చిత్రాలకు మాత్రం తేజ రెమ్యునరేషన్ భారీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.