Regina: ఇటీవలి కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. సౌత్, నార్త్ అనే కాకుండా హాలీవుడ్‌లోను కాస్టింగ్ కౌచ్ వివాదం ఎక్కువగా నడుస్తుంది. ఈ క్రమంలోనే మీటూ ఉద్యమం మొదలు కాగా, ఈ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాల గురించి మీడియా ముందు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి అందాల భామ రెజీనా కూడా చేరగా, తనకు ఎదురైన అనుభవాల గురించి తాజాగా చెప్పుకొచ్చి హాట్ టాపిక్ అయింది . తమిళ బ్యూటీ అయిన రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. టాలీవుడ్లో ఎంతో మంది యువ హీరోల సరసన నటించి మెప్పించింది .
తెలుగులో చాలా సినిమాలనే చేసిన కూడా ఈ అమ్మడికి పెద్ద హిట్స్ రాకపోవడంతో ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళంలోనే చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా .. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్టు పేర్కొంది.2005లో తన కెరీర్ మొదలు కాగా, అప్పుడు అవకాశాల కోసం పలువురిని కలిసాను. అప్పుడు ఒకరు ఫోన్ చేసి సినిమా అవకాశం ఇస్తామన్నారు. కాకపోతే అడ్జస్ట్ మెంట్ కు ఓకే అంటే తర్వాత షూటింగ్ పని చూసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నాకు అతని మాటలు అర్థం కాలేదు. అయితే అడ్జస్ట్ మెంట్ అంటే నేను ఏదో రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారేమో అనుకొని, నా మేనేజర్ మీతో మాట్లాడుతాడని ఫోన్ కట్ చేశాను.
కాని తర్వాత నా మేనేజర్ అసలు విషయం అర్ధమయ్యేలా చెప్పాడు. అయితే ఇది జరిగి పదేళ్లకి పైగా అయింది. అప్పుడు నా వయస్సు 20 ఏళ్లు ఉంటుంది అని రెజీనా పేర్కొంది. అయితే ఇటీవల చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. కొందరు నిజంగానే తమ జీవితంలో జరిగిన విషయాల గురించి చెబుతుండగా, మరి కొందరు ఫేమ్ కోసం కాస్టింగ్ కౌచ్‌ని వాడుకుంటున్నారు. ఏదేమైన ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.