Mega Heroes: టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి సినిమాలు థియేటర్స్ లో వస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అందుకే నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. అయితే మెగా ఫ్యామిలీలో సీనియర్ హీరోలుగా మారిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా అంత ప్రభావం చూపలేకపోతున్నారు. ఇద్దరికి మంచి స్టార్డం, మంచి క్రేజ్ ఉన్నా కూడా కథలో కంటెంట్ లేకపోతే ఎవరు కూడా ఆదరించడం లేదు. కటౌట్ ని చూసి సినిమా చూసే రోజులు పోయాయి. ఎంత పెద్ద హీరో అయిన సరే, కథలో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తున్నారు.
ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టాడు. ఇక రీసెంట్గా మెహర్ రమేష్ కాంబోలో వచ్చిన భోళా శంకర్ సినిమా చేయగా, ఈ చిత్రంకి ఎలాంటి టాక్ వచ్చిందో.. ఎలాంటి కలెక్షన్లు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కనీసం హాలీడే సమయంలో కూడా ఈ చిత్రం మోస్తరు కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. భోళా శంకర్ చిత్రం 50 కోట్లకు పైగా నష్టాలను తెచ్చి పెట్టేలా ఉందని ట్రేడ్ లెక్కలు చెప్పుకొస్తున్నారు. ఈ మూవీని 79 కోట్లకు అమ్మితే.. 80 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు భోళా శంకర్ చిత్రం కనీసం ముప్పై కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయిందని ఇన్సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందు రిలీజైన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ మల్టీ స్టారర్ బ్రో పరిస్థితి కూడా అంతే ఉంది.
బ్రో సినిమాకు ఈ 19 రోజుల్లో 97 కోట్ల బిజినెస్ చేస్తే.. ఇప్పటి వరకు 67 కోట్ల షేర్ వచ్చిందని, ఇక కలెక్షన్స్ క్లోజ్ అయ్యాయని అంటున్నారు. ఇంకా ముప్పై కోట్లు రాబడితే గానీ బ్రేక్ ఈవెన్ కాదు, కాని కలెక్షన్స్ క్లోజ్ కావడంతో ఈ సినిమాక ముప్పై కోట్ల వరకు లాస్ వచ్చినట్టేనని అంటున్నారు. కొంత గ్యాప్‌తో వచ్చిన ఇద్దరు మెగా హీరోలు నిర్మాతలకి భారీ నష్టాలని మిగల్చడంతో ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది . ప్రస్తుతం జైలర్ సినిమా దుమ్ములేపేస్తున్న నేపథ్యంలో బ్రో, భోళా శంకర్ థియేటర్లు దాదాపు ఖాళీగానే ఉంటున్నాయి.