Adipurush: ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు రోజులలో 240 కోట్ల రూపాయల వసూళ్లని రాబట్టింది. ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్పరంగా సత్తా చాటుతున్నప్పటికీ ఈ సినిమాని రోజుకో కాంట్రవర్సీ చుట్టుముడుతోంది. రాముడు, హనుమంతుడు పాత్రల వేషధారణపై హిందూ సేన అభ్యంతరాలు వ్యక్తం చేయడం, మరికొన్ని వర్గాలు డైలాగ్స్‌ను తప్పుపట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ రైటర్ మనోజ్ ముంతాషిర్ తాము అసలు రామాయణాన్ని తెరకెక్కించలేదని చెప్పుకొచ్చారు.
రామాయణాన్ని స్పూర్తిగా తీసుకొని చిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్ పెట్టినట్టు మనోజ్ తెలియజేశారు. ఈ విషయాన్ని డిస్క్లైమర్లోకూడా ప్రస్తావించినట్లుగా గుర్తుచేశారు. యుద్ధ కాండలోని కొంత భాగాన్ని మాత్రమే తాము చిత్రీకరించామని ఆయన తెలియజేశారు.సినిమా రిలీజ్‌కి ముందు రామాయణం నేపథ్యంలో చిత్రం రూపొందుతుందని చెప్పి, ఇప్పుడు కాదు అని అంటారేంటని అతనిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి చిత్రంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పలువురి సూచనల ఆధారంగా కొన్ని మార్పులు చేయబోతున్నారట.
ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ ఆదిపురుష్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు మేకర్స్. అయితే సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంచుతామన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో “ఆదిపురుష్ చిత్రాన్ని చూడవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి విజయం వైపు వెళ్తున్న ఈ చిత్రంలోని డైలాగ్స్ మార్పులు సినిమా టీమ్ కు ఒక సాహసం లాంటిదే అయినా.. ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించడం ముఖ్యమని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే భారీ సునామి సృష్టించిన ఆదిపురుష్ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు రోజులలో 200 కోట్ల క్లబ్ లో చేరిపోవడం విశేషం.