సినిమా రంగంలో నటీనటుల కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. హీరో, హీరోయిన్లుగా దశాబ్ధాల పాటు చక్రం తిప్పాలని అందరూ కోరుకుంటారు. కానీ, అది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. మిగిలిన వారు ఇండస్ట్రీకి దూరం కావడం లేదా గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం కొందరు సినీ తారలు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చెలరేగిపోతున్నారు. చేతి నిండా సినిమాలతో తగ్గేదే లే అంటూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. మరి వారెవరో ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
వరలక్ష్మి శరత్‌కుమార్: సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి.. 2004లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బాయ్స్ లో హీరోయిన్గా సెలక్ట్ అయింది. కానీ, తండ్రికి ఇష్టంలేకపోవడంతో వరలక్ష్మి శరత్‌కుమార్ బాయ్స్ మూవీ నుంచి తప్పుకుంది. కొన్నేళ్లకు శరత్‌కుమార్‌ను అతికష్టం మీద ఒప్పించి ఇండస్ట్రీలోకి అడగుపెట్టింది. కెరీర్ ఆరంభంలో వరలక్ష్మి హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అయితే భారీ పర్సనాలిటీ వల్ల ఆమె హీరోయిన్గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. లేడీ విలన్‌గా క్లిక్ అయింది. అలాగే సహాయక పాత్రలకు కూడా అద్భుతంగా యాప్ట్ అవుతూ సౌత్ తో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం లేడీ విలన్‌గా, సహాయక నటిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.
జగపతిబాబు: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటుల్లో జగపతిబాబు ఒకరు. అయితే హీరోగా ఫేడౌట్ అయిన తర్వాత ఆయన సింహా మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రతినాయక పాత్రలకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారారు. విలన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ ను కూడా పోషిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ హీరో రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈయన దూకుడుకి ఇప్పట్లో బ్రేకులు పడటం కూడా కష్టమే అని చెప్పుకోవచ్చు.
ప్రియమణి: టాలీవుడ్ దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా రాణించిన డస్కీ బ్యూటీ ప్రియమణి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా ఆల్మోస్ట్ ఆమె కెరీర్ ముగిసింది. స్టార్ హీరోలు ఆమెను పక్కన పెట్టేశారు. దీంతో గ్యాప్ తీసుకోకుండా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ప్రియమణి.. మళ్లీ అదే జోరుతో కెరీర్ ను సాగిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అధికంగా చేస్తోంది. అలాగే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అగ్రహీరోల సినిమాల్లో బలమైన సహాయక పాత్రలను పోషిస్తోంది. సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లతో బిజీ నటిగా సత్తా చాటుతోంది.
శ్రియా రెడ్డి: సలార్ మూవీతో శ్రియా రెడ్డి మరోసారి ఫామ్‌లోకి వచ్చింది. భారతీయ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు అయిన శ్రియా రెడ్డి.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో 2008 వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన శ్రియా రెడ్డి.. 2018లో సమ్ టైమ్స్ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియా రెడ్డి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు శ్రియా రెడ్డి సలార్ 2తో పాటు అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.
వినయ్ రాయ్: ఇటీవల కాలంలో స్టైలిష్ విలన్ పాత్రలకు వినయ్ రాయ్ వన్ ఆఫ్ ది ఛాయిస్‌గా మారుతున్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వినయ్ రాయ్ ఒకప్పడు హీరోగా సినిమాలు చేశాడు. 2008లో వచ్చిన రొమాంటిక్ డ్రామా వానలో హీరోగా నటించింది మరెవరో కాదు వినయ్ రాయ్‌నే. కమర్షియల్‌గా ఫ్లాప్ అయినా కూడా అప్పట్లో వాన మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. వినయ్ రాయ్ కు భారీగా లేడీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆపై పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ, పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో చిన్న గ్యాప్ తీసుకుని.. 2017లో విశాల్ డిటెక్టివ్ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సౌత్ లో స్టార్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్‌లో కూడా ప్రతినాయకుడిగా వినయ్ రాయ్ అద్భుతంగా అలరించాడు. ప్రస్తుతం మర్డర్ లైవ్ అనే హాలీవుడ్ మూవీతో అనేక సినిమాలు వినయ్ రాయ్ చేతిలో ఉన్నాయి.