తేజ సజ్జా సినీ హీరోగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం ఈ సినిమా. ఇంతకుముందు చేసిన జాంబీ రెడ్డి సినిమా పరవాలేదు అనిపించినా ఈ మూవీ మాత్రం ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోతుంది. తేజాని చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన జనాలు ఈ మూవీలోనూ ఇంకా చిన్న పిల్లాడిలానే చూస్తున్నారు. తనలో వయసు మార్పుని చూయించడానికి తేజ మరికాస్త ప్రయత్నం చేసి ఉండాలనేది ఒక అభిప్రాయం. అలాగే సినిమా కథ విషయానికి వస్తే ఇది నిజంగానే ప్రేమ కథ కాదు.. కానీ ఆ ప్రేమ నేపథ్యంలో నడిచే రీవెంజ్ కథ.
సిద్ధు అనే వైజాగ్ కి చెందిన సాఫ్ట్వేర్ కుర్రాడు.. అను అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజున తనని బయటికి తీసుకెళ్తానని లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు.. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న లవ్.. వాళ్ళిద్దరూ ఒక పార్కింగ్ స్పేస్ లో కిస్ చేసుకునేలా చేస్తుంది. ఐతే, సరిగ్గా ఇదే సంధర్భంలో వాళ్ళ దగ్గరికి పోలీస్ లా వచ్చిన ఒక వ్యక్తి.. వాళ్ళిద్దరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు. పోలీస్ అని చెప్పడం వల్ల అతన్ని ఎదుర్కోలేక అతను పెట్టే హింసలన్నీ మౌనంగా భరిస్తారు. ఇదే సమయంలో హీరోయిన్ అను వద్ద కూడా అనుచితంగా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి.
ఐతే.. తర్వాత అసలు విషయం తెలుసుకుంటాడు సిద్ధార్థ్. అతను పోలీస్ కాదని తెలిసి.. చేసిన తప్పుకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం ఎలా ఉంటుంది.. ఇంతకీ ఆ అమ్మాయితో ప్రేమ సంగతి ఏంటనేది మిగిలిన కథాంశం. నటన పట్ల తన సీరియస్నెస్ ని చూపించే ప్రయత్నం చేశాడు తేజ. అలాగే.. ఐ బ్లింక్ తో పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ పరవాలేదు అనిపించింది. కానీ, ఒరిజినల్ మలయాళంలో వచ్చిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకి సరిగా చూపించలేకపోయారని చెప్పాలి. ప్రేమికులపై జరిగే harrassment పాయింట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకి ఎంతో బోర్ కొట్టించేలా తీశారు.
నిజానికి ఒరిజినల్ కథలోనూ ఇలాంటి సంక్లిష్టత ఉన్నా.. రీమేక్ గా చేసిన తెలుగులో కథని మరింత సంక్లిష్టంగా మార్చేశారని చెప్పవచ్చు. Narration లోపభూయిష్టంగా ఉండటం కారణం. కేవలం డైరెక్షన్ లో మాత్రమే కాక ఇంకా పలు కోణాల్లో మూవీ మేకింగ్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. కథ మొదట్లో లేవనెత్తిన ప్రశ్నలన్నీటికీ సమాధానాలు ఇవ్వలేదు. అందుకే ఒకింత అసంతృప్తితో బయటికి రాక తప్పదు. తేజ సజ్జ మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావాలని కోరుకుందాం.
Filmy Looks Rating : 2.5/5
Leave a comment