Suman: 80లలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సుమన్ అనుకోని పరిస్థితుల వలన జైలుకి వెళ్లడం, ఆ తర్వాత ఆయన కెరీర్ క్రమక్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ వస్తున్న సుమన్ త్వరలో రాజకీయాలలోకి కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అయితే సుమన్ జైలు జీవితంకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంటుంది . ఆయనని పథకం ప్రకారమే నీలి చిత్రాల వివాదంలో ఇరికించారనే పుకార్లు హల్చల్ చేస్తుంటాయి. సుమన్ ని ఇరికించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కాని సుమన్ మాత్రం అవన్నీ అవాస్తవాలు అని ఖండించారు.
అయితే సుమన్ జైలుకి వెళ్లడానికి ప్రధాన కారణం ఆ ముగ్గురని దర్శకుడు సాగర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సుమన్ తో పలు సినిమాలు తీసిన సాగర్ తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ అప్పట్లో పని చేస్తున్న డీజీపీ, వడియార్ అనే లిక్కర్ కాంట్రాక్టర్ సుమన్ జైలుకు వెళ్లడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకొచ్చారు. అయితే డీజీపీ కూతురికి సుమన్ అంటే ఇష్టమని చెప్పిన సాగర్ ..షూటింగ్ ఎక్కడ జరిగినా ఆ అమ్మాయి వచ్చేదని సాగర్ చెప్పుకొచ్చారు.సుమన్‌కి ఆమె గురించి ఏ మాత్రం తెలియదు. ఆమెది వన్ సైడ్ లవ్. కాని తన కుమార్తె ని సుమన్ ట్రాప్ చేశాడు అని డీజీపీ తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఆ సమయంలో సుమన్ స్నేహితుడు ఒకరు లిక్కర్ కాంట్రాక్టర్ కుమార్తె తో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని డిజిపి ..ఎంజీఆర్ కి వివరించారు. దాంతో ఎంజీఆర్ సుమన్ ని ఇంటికి పిలిపించుకుని.. డిజిపి కుమార్తెకి దూరంగా ఉండాలని హెచ్చరించాడట. అప్పుడు ఆ విషయాన్ని మీరు నాకు కాదు, ఆమెకి చెప్పండి అని గట్టిగా అనడంతో ఎంజీఆర్ కి కోపం వచ్చింది. దీంతోనే సుమన్‌పై తప్పుడు కేసులు పెట్టారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండగా, అక్కడికి అమ్మాయిలు కూడా వచ్చేవారు. దీనితో సుమన్ కి బెయిల్ రాని విధంగా పలు కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్లారు. అయితే సుమన్ తల్లికి గవర్నర్ తెలిసిన వారు కావడంతో దాదాపు ఆరునెలల తర్వాత బెయిల్ వచ్చింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సుమన్ నటించాల్సిన చిత్రాలు ఆగిపోయాయి. ఆస్తులు కూడా పోయాయి అని సాగర్ తెలియజేశారు.