Allari Naresh: దర్శక దిగ్గజం ఈవీవీ సత్యనారాయణ నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఫస్ట్ సినిమా ‘అల్లరి’ తో ‘అల్లరి’ నరేష్‌గా స్థిరపడిపోయాడు. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘నేను’, ‘గమ్యం’ లాంటి విభిన్నమైన సినిమాలతోనూ ఆకట్టుకుని వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ‘నాంది’ తో లాంటి సీరియస్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి.. నరేష్ ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా చెయ్యగలడని ఇండస్ట్రీ వారు, ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశాడు. ప్రస్తుతం సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నారు. గురువారం (జూన్ 30) నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఇట్లు మారుడుమిల్లి ప్రజానీకం’ టీజర్ రిలీజ్ చేశారు. నరేష్ నటిస్తున్న 59వ సినిమా ఇది.
జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్ల మీద రాజేష్ దండు నిర్మిస్తుండగా.. ఎ.ఆర్.మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆనంది కథానాయిక. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది.
నరేష్ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉన్నాయి. టీజర్ ద్వారా క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారూ’ అంటూ అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. త్వరలో ‘ఇట్లు మారుడుమిల్లి ప్రజానీకం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Leave a comment