కొంతకాలం క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన కత్తి మహేష్ మృతి చెందారు. కేవలం గాయాలు మాత్రమేనని, తొందర్లోనే కోలుకుంటారని కూడా అందరూ భావించారు. కానీ ఆ ప్రమాదం అతనికి ప్రాణాంతకంగా మారింది. కత్తి మహేష్ తొందరగా కోలుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యనే 17 లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది. అలా మంజూరు చేయడంపై విమర్శలు వచ్చినా ఆ డబ్బు ఆయన ప్రాణాలని కాపాడలేకపోయింది.
కత్తి మహేష్ తెలుగు ప్రజలకి బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయ్యారు. అప్పటిదాకా ఒక సాధారణ ఫిల్మ్ క్రిటిక్ గా పని చేస్తున్న ఆయన ఈ షో తర్వాత మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ఈ గుర్తింపుతో తన రాజకీయ స్వరం కూడా వినిపించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా కత్తి మహేష్ తన అభిప్రాయాలని చెప్తుండేవాళ్ళు. కత్తి మహేష్ ది వెనకబడ్డ సామాజిక వర్గం అవడం చేత ఆయన వాదనలు కూడా అటువైపే ఉంటూ ఉండేవి. జనసేన అధినేత విషయంలో, అలాగే ఇతిహాసాలను ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మీద విమర్శలు ఉన్నాయి.
మహేష్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు సన్నిహితులు ఉన్నారు. చిత్తూర్ లో పుట్టిన ఆయన సినిమాల మీద ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. స్వయంగా రచయిత కూడా అయిన కత్తి మహేష్ కొన్ని సినిమాలకి కూడా పనిచేశారు. ఆయన అభిమానులు, సినీ పరిశ్రమలో స్నేహితులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. కత్తి మహేష్ వయసు 44 ఏళ్ళు.
Leave a comment