తెలుగువారే అయినా బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడ మూకీ సినిమాలు.. అంటే సైలెంట్ ఫిల్మ్స్ లో నటిస్తూ, గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇండియాలోనే ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో కొనసాగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ‘పైడి జయరాజ్’ గారి గురించి తెలుసుకుందాం.
సినిమాలపై ఆయనకున్న ఆసక్తితో..
జయరాజ్ గారు 1909 సంవత్సరం తెలంగాణాలోని సిరిసిల్లలో పుట్టారు. ‘భారత కోకిల’ గా పేరున్న గొప్ప కవయిత్రి సరోజినీ నాయుడికి ఆయన స్వయంగా మేనల్లుడు. ఆమె ఆలోచనల ప్రభావం ఆయనపై ఎంతగానో ఉండేది. నాటకాలు, సినిమాల్లో ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తితో నిజాం కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే నాటకరంగంలోకి ప్రవేశించారు.
బాలీవుడ్ కి వెళ్ళి పడ్డ కష్టాలు : సినిమాకి అప్పట్లో అంతగా స్కోప్ లేని రోజులవి. ఈ కారణంగానే, ఆయన సినిమా ప్లాన్స్ కుటుంబానికి నచ్చేవి కాదు. వాళ్ళు వ్యతిరేకించడంతో నటనపై ఇష్టం పోగొట్టుకోలేక ఇంటినుండి పారిపోవాల్సి వచ్చింది. అలా సినిమా అవకాశాల కోసం 1929 లో బాంబే(ఇప్పటి ముంబై) చేరుకున్నారు. అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు మాత్రమే. మొదట ఆయనకు డూప్లికేట్ స్టంట్-మేన్ గా అక్కడ ఒక ఉద్యోగం దొరికింది. తర్వాత ఎన్నో odd-jobs చేస్తూ బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండేవారు.
సైలెంట్ సినిమాలతో మొదలైన జర్నీ : ఆ సమయంలో మూకీ సినిమాలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉండేవి బాలీవుడ్ లో. అంటే వాటిల్లో మాటలు మాత్రమే కాదు, ఎలాంటి BGM కూడా ఉండదు. అలా ‘Star Kling Youth’ అనే ఒక సైలెంట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ జర్నీ స్టార్ట్ చేసారు జయరాజ్. కానీ మంచి నటుడిగా ఆయనకు ఫేం తీసుకువచ్చిన సైలెంట్ ఫిల్మ్ మాత్రం ‘రసిలి రాణి’. 1929-31 మధ్య కాలంలోనే మరో పది మూకీ సినిమాల్లో నటించారు. వాటిల్లో ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘మై హీరో’, ‘ఫ్లైట్ ఇంటు డెత్’ వంటివి కొన్ని.
టాకీ సినిమాలలోనూ నిరూపించుకున్నారు..
అలాగని ఆయన సైలెంట్ ఫిల్మ్స్ కి మాత్రమే పరిమితం అవలేదు. ఆ తర్వాత అప్పుడే (1931 లో) మొదలవుతున్న టాకీ సినిమాలలో నటించటం మొదలుపెట్టారు. అలా ‘షికారీ’ ఆయన మొదటి టాకీ ఫిల్మ్. ఇక అక్కడినుంచి ఆయన ప్రయాణం ఆగలేదు. ఒక రెండు దశాబ్దాల పాటు శాంతారాం, పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, మోతీలాల్ వంటి నటులతో పాటు లీడింగ్ యాక్టర్ గా కొనసాగారు. పృథ్వీరాజ్ కపూర్ తండ్రితో ఆయనకి సన్నిహిత సంబంధం ఉండేది. ఆయనే స్వయంగా ఒక పంజాబీ అమ్మాయిని చూసిపెట్టి, దగ్గరుండి జయరాజ్ గారికి పెళ్ళి జరిపించడం విశేషం. తర్వాత ఆయన రకరకాల పాత్రలతో దాదాపు 170 సినిమాల దాకా నటించారు. అమర్ సింగ్ రాథోడ్, పృథ్విరాజ్ చౌహాన్, మహా రానా ప్రతాప్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి పాత్రల్ని పోషించారు. షాజహాన్, టిపు సుల్తాన్, హైదర్ అలీ వంటి పాత్రల్ని సినిమాల కోసం రచించారు.
పలు భాషల్లో ప్రవేశం : హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, గుజరాతీ భాషల్లో కూడా ఆయన నటించారు. ఆ భాషలు వచ్చి ఉండడం వల్ల కూడా ఇది సాధ్యమైంది. ఇంటర్నేషనల్ ఆక్టర్స్ అయిన రాబర్ట్ మార్లే, జోస్ ఫెర్రర్ వంటి నటులతో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన స్వయంగా తెలుగువారు అయినప్పటికీ, తన కాలేజ్ డేస్ లో డ్రామా థియేటర్ ఆర్టిస్ట్ గా చేయడం తప్పించి ప్రత్యేకంగా తెలుగు సినిమాలలో నటించకపోవడం గమనార్హం.
సినిమా అన్ని విభాగాల్ని టచ్ చేసిన పైడి : పైడి జయరాజ్ కి దర్శకత్వంలో కూడా ప్రవేశం ఉంది. తన సొంత డబ్బుతో 1952 లో ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ‘సాగర్’ అనే ఒక సినిమా తీసారు. అది కమర్షియల్ గా సక్సెస్ అవకపోవడంతో నష్టాల్లో మిగిలిపోయినా ఆయన తన సినీప్రయాణాన్ని అంతటితో ఆపేయలేదు. శాస్త్రీయ సంగీతాన్ని, నృత్యాన్ని విస్తరించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటికి నిర్మాతగా వ్యవహరించారు. సినీనటుల అసోసియేషన్ లో ఆక్టివ్ మెంబర్ గా ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు.
చివరి రోజులు అలా ముగిసాయి : చివరి రోజుల వరకు కూడా ఆయన సినిమా కోసమే కట్టుబడి ఉన్నారు. జయరాజ్ చివరి సినిమా 1995 లో విడుదలైన ‘God and Gun’. జయరాజ్ 2000 సంవత్సరంలో చనిపోయారు. కేన్సర్ తో తన కన్నా ఒక సంవత్సరం ముందే భార్య చనిపోవడం ఆయన్ని ఎంతో కలచివేసిందని చెప్తారు. ఆయన చివరి సంవత్సరం ఆయన్ను తన కూతురు చూసుకుంది. చనిపోయేటప్పటికి ఆయన వయసు 91 సంవత్సరాలు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను ఆయనకు జీవిత సాఫల్య పురస్కారంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ అవార్డ్ పొందిన తొలి తెలంగాణా పౌరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. Silent-era లోని ఒకానొక గొప్ప హీరోగా పైడి జయరాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
Leave a comment