తెలుగు దిగ్గజ నటుల్లో కృష్ణంరాజు ఒకరు. వెండితెరపై హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా కృష్ణంరాజు ఓ వెలుగు వెలిగారు. నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. రెబల్ స్టార్ గా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి కృష్ణంరాజు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. నటుడు కావాలని కృష్ణంరాజు ఎప్పుడు అనుకోలేదు. చదువు పూర్తి అయిన వెంటనే ఫోటో జర్నలిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్రరత్న పత్రికలో ఫోటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఆయన తీసిన ఫోటోలకుగానూ రాష్ట స్థాయిలో సెకండ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా అవార్డు కూడా వచ్చింది. అయితే కృష్ణంరాజు పర్సనాలిటీ చూసి కొంత మంది నిర్మాతలు, స్నేహితులు సినిమాల్లో ప్రయత్నించమని సూచించారు. అప్పుడే కృష్ణంరాజుకు సినిమాలపై ఆసక్తి కలిగింది.
సినిమాల్లో పాత్రల కోసం పెద్దగా కష్టపడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించిన కృష్ణంరాజు.. 1966లో కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన చిలకా గోరింక చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా.. ఉత్తమ చిత్రంగా చిలకా గోరింక నందీ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత శ్రీకృష్ణావతారం, నేనంటే నేనే, భలే అబ్బాయిలు, భలే మాష్టారు, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి.. ఇలా వరుస చిత్రాల్లో కృష్ణంరాజు నటించారు.సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి చాలా సినిమాల్లో వర్క్ చేశారు. విలక్షణమైన నటనతో విభిన్నమైన పాత్రలతో వెండితెరను ఏలేస్తారు. తెరమీద అన్ని రకాల హావభావాలను పలకిస్తూ గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అమరదీపం, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, అంతిమ తీర్పు, తాండ్ర పాపారాయుడు తదితర చిత్రాలు కృష్ణంరాజు ఇమేజ్ ను తారా స్థాయికి తీసుకెళ్లాయి.
సాంఘిక చిత్రాల్లోనే కాకుండా పౌరణాకి, జానపద సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రియాణంలో విలన్‌గా, హీరోగా, సహాయక నటుడిగా దాదాపు 180కి పైగా చిత్రాల్లో కృష్ణంరాజు పని చేశారు. రెబల్ స్టార్ గా తెలుగు సినీ పరిశ్రమలో చెరుగని ముద్ర వేశారు. ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు. అలాగే 1974 నుంచి గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు పలు హిట్ సినిమాలను నిర్మించారు. ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఇక కృష్ణంరాజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆయన సతీమణి పేరు శ్యామల దేవి అని అందరికీ తెలుసు. కానీ, కృష్ణంరాజుకు శ్యామల దేవి మొదట భార్య కాదు. కృష్ణంరాజు ముందుగా సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. వరుసకు ఆమె రెబెల్ స్టార్‌కు మేనకోడలు అవుతుంది. సీతాదేవితో కృష్ణంరాజు వివాహం 1969లో జరిగింది. ఆ టైమ్ లో ఆయన అమ్మ కోసం మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి ముందు వరకూ షూటింగ్లో పాల్గొన్న ఆయన.. ముహూర్తం సమయానికి వచ్చి సీతాదేవి మెడలో తాళి కట్టారట.
అయితే సీతాదేవి 1995లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య మరణం కృష్ణంరాజు చాలా కృంగిదీసింది. సీతాదేవి మృతి తర్వాత కొన్ని నెలల పాటు ఒంటిరి జీవితాన్ని గడిపిన కృష్ణంరాజు.. కుటుంబసభ్యుల ప్రోద్బలంతో 1996లో శ్యామల దేవిని రెండో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద లండన్‌లో ఎంబీఏ కంప్లీట్ చేసి.. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణతగా రాణిస్తోంది. అలాగే రెండో కూతురు ప్రకీర్తి, మూడు కూతురు ప్రదీప్తి చదువుకుంటున్నారు. ఈ ముగ్గురే కాకుండా కృష్ణంరాజుకు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె పేరు ప్రశాంతి. కృష్ణంరాజు, ఆయన మొదట భార్య సీతాదేవికి పిల్లలు కలగకపోవడంతో.. వారు ప్రశాంతిని దత్తత తీసుకున్నారు. సీతాదేవి చనిపోయినా కూడా ప్రశాంతిని మాత్రం కృష్ణంరాజు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఆమెకు వివాహం జరిపించారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న 82 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.