సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన మహేష్ .. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారాడు. బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన టాలెంట్ తో అంచెలంచలుగా ఎదిగి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి తగ్గా తనయుడిగా నిరూపించుకున్నాడు. 50కి చేరువవుతున్నా చెక్కు చెదరని అందంతో అమ్మాయిల కలల రాజకుమారుడిగా, ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ గా వెలుగొందుతున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు హీరోగా 28 చిత్రాల్లో నటించాడు. వీటిలో కొన్ని హిట్ అయితే.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇంకొన్ని బ్లాక్ బస్టర్స్‌గా, ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. వాటి గురించి పక్కన పెడితే.. మహేష్ బాబు కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ జాబితాలో షూటింగ్ ప్రారంభం అయ్యాక ఆగిపోయిన సినిమాలే కాకుండా ప్రకటనలతోనే ఆగిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయి. మరి లేటెందుకు ఆ సినిమాలు ఏవో ఓ లుక్కేసేయండి.
శివమ్: డైరెక్టర్ క్రిష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పదేళ్ల క్రితం శివమ్ అనే సినిమాను ప్రకటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించాలని అనుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని ఎంపిక చేశారు. స్టోరీ విన్న రాజమౌళి కూడా అప్పట్లో ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు కెరీర్ శివమ్ ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని పేర్కొన్నారు. కానీ, షూటింగ్ ప్రారంభం కాకముందే శివమ్ అటకెక్కింది. 2014లో 1 నేనొక్కడినే విడుదలై డిజాస్టర్ కావడంతో ప్రయోగాత్మక చిత్రాలంటే మహేష్ బాబు వెనకడుగు వేశాడు. ఈ కారణంగానే శివమ్ ఆగిపోయింది.
హరేరామ హరేకృష్ణ: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కంబినేషన్ ఇప్పటి వరకు అతడు, ఖలేజా మరియు రీసెంట్‌గా గుంటూరు కారం చిత్రాలు వచ్చాయి. అయితే ఈ మూడు కాకుండా త్రివిక్రమ్, మహేష్ కలయికలో హరేరామ హరేకృష్ణ అనే మరో సినిమా రావాల్సి ఉంది. MS రాజు ఈ సినిమాకి నిర్మాత. ఘనంగా ప్రారంభం అయ్యి రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.
మిస్టర్ పర్ఫెక్ట్: టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం మహేష్ బాబుతో ఓ మూవీని అనౌన్స్ చేశాడు. వీరి కాంబో చిత్రానికి మిస్టర్ పర్ఫెక్ట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అప్పుడే నిర్మాణ సంస్థ అప్పుల్లో చిక్కుకోవడం వల్ల సినిమా ఆగిపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్ కోసం మహేష్ బాబు తీసుకున్న రూ. 2 కోట్ల అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత అదే టైటిల్ ను ప్రభాస్ తన సినిమాకు వాడుకున్నాడు.
మిర్చి: మహేష్ బాబు కెరీర్ లో ప్రకటనతోనే ఆగిపోయిన చిత్రాల్లో మిర్చి ఒకటి. అసోసియేట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేసిన మహేష్ బాబు సన్నిహితుడు జాస్తి హేమాంబర్ మిర్చి చిత్రాన్ని 2010లోనే అనౌన్స్ చేశాడు. మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రారంభం కావాల్సిన మిర్చి పలు కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇక మిర్చి టైటిల్ మహేష్ బాబు కోసమే రిజిస్టర్ చేయించినా.. చివరకు అది ప్రభాస్‌కే దక్కింది.
అతడే: ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుని టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.వి. వినాయక్.. గతంలో మహేష్ బాబును హీరోగా పెట్టి అతడే అనే టైటిల్ తో ఓ సినిమాను ప్లాన్ చేశారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ, స్క్రిప్ట్ లో ఉన్న లోపాల కారణంగా మహేష్ బాబు వెనకడుగు వేశాడు. దాంతో అతడే సినిమా ఆరంభంలో ఆగిపోయింది.
జన గణ మన: పోకిరి, బిజినెస్‌మెన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో జన గణ మన అనే సినిమా రావాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మిలటరీ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని చాలా ఏళ్ల క్రితమే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఫుల్ స్క్రిప్ట్ పూర్తి కాకపోవడం వల్ల మహేష్ బాబు జన గణ మనపై ఆసక్తి చూపలేదు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యే సమయానికి పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపులతో తన ఫామ్ ను కోల్పోయి ఉన్నారు. దాంతో ఆయనకు మహేష్ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ కారణంగా పూరీ బహిరంగంగానే మహేష్ ను విమర్శించాడు. ఇక లైగర్ సమయంలో విజయ్ దేవరకొండతో జన గణ మనను ప్రారంభించారు. అయితే లైగర్ డిజాస్టర్ అవ్వడం వల్ల జన గణ మన ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
స్నేహితుడు: బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 3 ఇడియట్స్ రీమేక్ అయిన స్నేహితుడు చిత్రంలో మొదట హీరోగా మహేష్ బాబు అని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఎస్. శంకర్ ఈ మూవీకి దర్శకుడు. జీవా, శ్రీకాంత్ లను హీరో ఫ్రెండ్స్‌గా.. ఇలియానాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే సినిమా ప్రారంభానికి ముందే ఏమైందో ఏమోగానీ.. మహేష్ బాబు స్నేహితుడు నుంచి తప్పుకున్నాడు. దాంతో దళపతి విజయ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వీరుడు: దర్శకుడు గుణశేఖర్ తో మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక్కడు, అర్జున్, సైనికుడు వంటి సినిమాలు చేశారు. వీటిల్లో ఒక్కడు చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు కెరీర్ గురించి మాట్లాడితే ఒక్కడు ముందు, ఒక్కడు తర్వాత అనే ప్రస్తావిస్తారు. అయితే 2006లో వచ్చిన సైనికుడు ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ మహేష్ బాబుతో వీరుడు అనే సినిమాను అనౌన్స్ చేశారు. కానీ, ప్రటకనతోనే ఈ సినిమా ఆగిపోయింది.
దిగ్గజ దర్శకుడు మణిర్నం- మహేష్ బాబు, చియాన్ విక్రమ్ కాంబినేషన్ తో ఓ సినిమా రాబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఈవిషయం తెలియగానే మహేష్ అభిమానులు ఎంతో ఆనందంతో ఊడిపోయారు. అయితే ఈ ప్రాజెక్ట్ దురదృష్టవశాత్తు ఆరంభంలోనే అటకెక్కింది. ఇక మెహర్ రమేష్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని గతంలో ప్రకటన వచ్చింది. పైగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ అని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా ఆగిపోయింది.