Manchu Manoj Couple: రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది. చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిరుపేదలకి, అనాథలకి ప్రత్యేకంగా చూపించాలని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కార్తీకేయ2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇప్పటికే 10వేల టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ సైతం 10 వేల టిక్కెట్లు పేదల కోసం తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలోని పాపులర్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు అందజేస్తున్నట్టు ప్రకటించింది. ఇక తాజాగా మంచు మనోజ్ దంపతులు కూడా పేదలకి ఈ సినిమాని చూపించేందుకు ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న 2500 పిల్లలకు ‘ఆదిపురుష్’ సినిమాను ఉచితంగా చూపించేందుకు మనోజ్, మౌనిక దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు
రెండు ప్రైవేటు సంస్థలతో వీరు చేతులు కలిపి ఈ మంచి కార్యక్రమం చేయబోతున్నారు. బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్ సంస్థలతో మేం చేతులు కలుపుతున్నాం అని మంచు మనోజ్ తన ప్రకటనలో తెలిపారు. అంతేకాదు జై శ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్నిచోట్లా ప్రతిధ్వనించాలి అంటూ మనోజ్ తెలియజేశారు. మనోజ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆయన అభిమానులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రానున్న రోజులలో కూడా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని వారు సూచిస్తున్నారు. ఇక కొందరు ఫ్యాన్స్ అయితే మనోజ్ అన్న..‘నిన్న చూసి మేం ఎప్పుడూ గర్వపడతాం అన్న’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.