Multi Starrer: ఇటీవల మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకులని ఎక్కువగా అలరిస్తూ ఉండడం చూస్తున్నాం. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. ఇక మరి కొద్ది రోజులలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన బ్రో చిత్రం విడుదల కానుంది. జూలై 28న విడుదల కానున్న ఈ మెగా మల్టీ స్టారర్ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో మెగా మల్టీ స్టారర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తుండగా, ఇది విని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాలలో ఏదో ఒక హీరో ఉండేలా చూసుకుంటున్నాడు. ఆచార్య సినిమా నుండి చిరంజీవి సినిమాలో ఎవరో ఒక హీరో ముఖ్య పాత్రలో మెరుస్తున్నాడు. ఇక త్వరలో చిరంజీవితో ప్రశాంత్ నీల్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో రామ్ చరణ్ కూడా కనిపించి అలరించనున్నారని అంటున్నారు. ఆచార్యలో గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం ఫుల్ లెంత్ రోల్ లో కనిపించాలని ప్రశాంత్ నీల్ తో చెప్పారట. దాంతో ఇద్దరికీ సూటయ్యే కథ సిద్ధం చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారట. గతంలో ఈ ఇద్దరు ఆచార్య సినిమా చేసినప్పటికీ సంతృప్తిలేదు. అందుకని ఈసారి ఎలాగైనా ఇద్దరి కాంబినేషన్ లో సాలిడ్ హిట్ కొట్టాలని భావిస్తున్నారట.
అయితే ఇప్పటికే ప్రశాంత్ నీల్ చిరు కోరికకి తగ్గట్టే మూడు కథలు చెప్పడం కూడా జరిగిందట.ఇందులో ఒక కథని మెగాస్టార్ ఫైనల్ చేసినట్టు సమాచారం. భారీ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమాపై అధికారిక ప్రకటన మరి కొద్ది రోజులలో రానుందని తెలుస్తుంది. చిరంజీవి సినిమాలు చూసి స్ఫూర్తి పొందిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు అతనితో పాటు ఆయన కొడుకుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.