Pooja Hegde: చిన్న హీరోయిన్గా తెలుగు తెరకి పరిచయమై పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎదిగింది పూజా హెగ్డే. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే మొదటి రోజుల నుండి కూడా సినిమాలపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. ఈ క్రమంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్గా తన అదృష్టం పరీక్షించుకుంది. మొదటి రెండు మూడు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత మాత్రం గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. 2014లో నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత చేసిన పలు చిత్రాలు పూజాకి నిరాశపరిచాయి. అరవింద సమేత చిత్రం నుండి ఈ అమ్మడిని వరుస హిట్స్ పలకరించాయి. మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ భామ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘డీజే దువ్వాడ జగన్నాథం’ నుంచి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వరకు… డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న పూజా హెగ్డే ఇటీవల మాత్రం వరుస ఫ్లాపులు అందుకుంటుంది.ఈ అమ్మడి నుండి వచ్చిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ టాక్ అందుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పని అయిపోయిందని చాలా మంది చెప్పుకొస్తున్నారు.
కాని అందరు అనుకున్నట్టు పూజాకి ఆఫర్స్ ఏం తగ్గలేదు. ఆమె కిట్టిలో ఇప్పుడు ఆరు సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తుంది. అది కాకుండా తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. హిందీ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు ఛాన్సులు వస్తున్నా… వెంటనే ఓకే చెప్పడం లేదని అంటున్నారు. తన పాత్రతో పాటు కథ ఎలా ఉంది? కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉందా? వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుందట. ఏదేమైన ఈ ఏడాది మొత్తం ఆరు సినిమాల షూటింగులు చేయాలని, ఒకట్రెండు నెలల్లో వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేయనుందని అంటున్నారు.