Jagan-Pawan: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వారాహి యాత్రలో భాగంగా పలు ప్రాంతాలకి వెళుతూ అక్కడ సమస్యలని అడిగి తెలుసుకుంటూ నాయకుల పనితీరుని ఎండగడుతున్నారు. రియల్ లైఫ్‌లో ఎప్పటి నుండో ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్ళూరుతున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ యాత్రలో వైసీపీ నాయకులని తిడుతుండడంతో, వారు కూడా పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్గా వైఎస్ జగన్ .. పవన్ ని ఉద్దేశించి తెగ ఊగిపోతాడంటూ కామెంట్ చేశారు. దానికి స్పందించిన పవన్.. నేను కూడా ఇప్పటి నుండి జగన్ స్టైల్లోనే ఇలా.. ఇలా మాట్లాడతానంటూ సీఎంను అనుకరించారు.
అమ్మ ఒడి లాంటి కార్యక్రమంలో జగన్ మాట్లాడిన తీరు ఏం బాలేదు అని పవన్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కి ‘అ’ నుంచి ‘‘అం, అ:’’ వరకు అక్షరాలు కూడా రావని.. దీర్ఘాలు కూడా రావని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి తానే దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తానని పవన్ పేర్కొన్నారు. ఒక నియంత, ఒక కంఠకుడు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండడం చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్‌కు వరాహికి.. వారాహికి కనీసం తేడా కూడా తెలియకపోవడం దారుణం అని ఆయన అన్నారు.
గతంలో తాను చెప్పు తీసి చూపించడం వెనక చాలా జరిగిందని పవన్ చెప్పుకొచ్చారు. అయితే పవన్‌పై వైసీపీ నాయకుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర సమస్యలపైన రాజకీయాలపైన ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శలు చేస్తున్నారు. పవన్ ఎప్పుడైతే వైసీపీ నేతల విమర్శల నుంచి బయట పడితే తప్ప రాష్ట్రంలో జనసేనకు పట్టు దొరకడం కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రానున్న ఎన్నికలలో పవన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.