Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 14 నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. అయితే ఆయన తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ధర్మయాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ స్వయంగా ప్రారంభించడం విశేషం.. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యాగాన్ని ప్రారంభించారు. గణపతి పూజతో ఆయన ఈ యాగానికి అంకురార్పణ చేశారు.
ఈ రోజు ఉదయం 6:55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రధారణ లో యాగశాలలో జనసేనాని దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతోనే ఆయన దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపన చేయగా, ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన జరిగింది. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా నేటి ఉదయం ప్రారంభమైన యాగం రేపు కూడా కొనసాగుతుందని చెప్పారు.అయితే ఈ యాగం ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా యాగం నిర్వహిస్తున్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లించేలా చేస్తుంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల ఎంతో శోభాయమానంగా అలరారుతోంది. ఈ యాగం నిర్వహించేందుకుగాను ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ గారు యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎలాంటిహడావిడి, ఆర్భాటాలు ఏమి లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతన కలిగిస్తోంది.. అని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. ఇక ఎన్నికలను పురస్కరించుకుని జనసేన ప్రచార రథాన్ని సిద్దం చేయగా,దీని కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టారని అంటున్నారు.